అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో  కరోనా విజృంభిస్తున్నా లాక్ డౌన్ ను సడలించి మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వంపై ప్రతిపక్షాలే కాదు కొందరు సామాన్యులు కూడా విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా సోమవారం వైన్ షాప్ ల వద్ద మద్యం కోసం ప్రజలు గుమిగూడటంతో కరోనా నిబంధనల ఉళ్లంఘన జరిగింది. కొన్ని కిలోమీటర్ల మేర వైన్ షాపుల ముందు క్యూలైన్ లో నిలబడ్డవారు సోషల్ డిస్టెన్సింగ్ పాటించలేదని... ఇందుకు ప్రభుత్వ అజాగ్రత్తే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నింటిపై ఏపి డిప్యూటీసీఎం, ఎక్సైజ్‌ శాఖమంత్రి నారాయణ స్వామి తాజాగా స్పందించారు. 

''మద్యం దుకాణాలు కేవలం ఏపిలోనే కాదు అన్ని రాష్ట్రాల్లోనూ తెరుచుకున్నాయి. అంతేకాకుండా ఇవాళ ప్రసార సాధనాల్లో కనిపించిన దృశ్యాలన్నీ రాష్ట్రం మొత్తంలోనివి  కావు... కేవలం కొన్నిచోట్లకు సంబంధించినవే. మిగిలిన చోట్ల సోషల్‌ డిస్టెన్స్‌తో మద్యం విక్రయాలు జరిగాయి. ఈ విషయాన్ని అందరూ గమనంలోకి తీసుకోవాలి'' అని సూచించారు. 

'' కేవలం గ్రీన్‌జోన్లలో మాత్రమే మద్యం దుకాణాలు తెరుచుకున్నాయన్న విషయాన్ని ప్రసార మధ్యమాలు, ప్రజలు గుర్తించాలి. నిత్యం తెరుస్తున్న నిత్యావసరాలకు, ప్రతినెలా ఇస్తున్న రేషన్‌కు కూడా భౌతిక దూరం పాటిస్తూ కొనుగోలు చేయాలని ప్రభుత్వం పదేపదే చెప్తోంది. అలాగే మద్య విక్రయాల సమయంలోకూడా భౌతిక దూరం పాటించాలని చెప్పాం, ఆమేరకు చర్యలు తీసుకున్నాం. నిబంధనలు పట్టించుకోకపోవడంతో కొన్ని దుకాణాలను ఉదయమే మూసివేశాం. ఎక్కడైనా భౌతిక దూరం పాటించకపోతే వాటిని మూసివేయమని కలెక్టర్లకు జిల్లా ఎస్పీలకు స్పష్టంగా చెప్పాం. ఆ మేరకు వారుకూడా చర్యలు తీసుకుంటున్నారు'' అని వివరణ ఇచ్చారు.  

'' ఇవాళ మద్యం దుకాణాలు తెరుచుకోవడానికి, మేం ఇచ్చిన మద్య నిషేధం హామీకి లింకు పెట్టి టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. మా హామీని ఖచ్చితంగా నెవేరుస్తాం. 
ఆ దిశగా ఎన్నో చర్యలు తీసుకున్నాం''  అని అన్నారు. 

''ఇదే లాక్‌డౌన్‌ సమయంలో ఎన్ని కష్టాలు ఉన్నా ఇతర హామీలను కూడా నెరవేరుస్తున్న విషయాన్ని ప్రజలు గమనించారు. ఫీజురియింబర్స్‌ మెంట్, వసతి దీవెన, సున్నావడ్డీ  పథకం, అలాగే  ఇవ్వబోతున్న మత్స్యకార భరోసా, రైతు భరోసాలన్నీకూడా అమలు చేస్తున్నాం, చేయబోతున్నాం.అలాగే మద్య నిషేధం కూడా దశలవారీగా చేసి తీరుతాం'' అని అన్నారు. 

''తెలుగుదేశం వారు మద్యం ధరలు పెరిగాయని బాధపడుతున్నారా? లేక వారి దుకాణం మూతబడుతున్నందుకు బాధపడుతున్నారా? ఖచ్చితంగా టీడీపీ దుకాణం మూతబడుతుంది. చంద్రబాబు ఇక భవిష్యత్తులోనూ రాజకీయ క్వారంటైన్‌ కాబోతున్నారు. ఇంత కష్టసమయంలో పాల అమ్మకం ధరలు పెంచి వినియోగదారుల నుంచి పిండుకుంటున్న చంద్రబాబు నాయుడు కూడా మద్యం ధరలమీద విమర్శలు చేయడం హాస్యాస్పదం'' అంటూ మంత్రి నారాయణస్వామి ఎద్దేవా చేశారు.