అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని తిట్టిపోశారు. ముఖ్యమంత్రి  వైయస్ జగన్ 32 రకాల ఉపాధి అవకాశాలను దెబ్బతీశారని చంద్రబాబు ఆరోపించారు. 

ఆర్థిక కార్యకలాపాలకు తూట్లు పొడవడమే కాకుండా ఏకంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీశారంటూ ధ్వజమెత్తారు. పేదల కడుపుకొట్టి వైసీపీ నేతలు పొట్టలు పెంచుకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

తెలుగుదేశం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఇసుక కొరతపై ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను నిలిపివేసిన సందర్భంలో టీడీపీ నేతలు ధర్నాలు చేశారని చెప్పుకొచ్చారు. దాంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చిందని ఇది తెలుగుదేశం పార్టీ విజయం అంటూ అభివర్ణించారు. అదే స్ఫూర్తితో ఇసుక కొరతపై కూడా నిరసనలు చేపట్టాలని సూచించారు. 

తెలుగుదేశం పార్టీ హయాంలో డ్వాక్రామహిళలకు ఆదాయం వచ్చేలా ఇసుక పంపిణీ చేశామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఉచితంగా ఇసుక అందుబాటులోకి తెచ్చినట్లు స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక ధరలు చుక్కలనంటాయని ఆరోపించారు.
 
సిమ్మెంట్ ధర కన్నా ఇసుక ధర ఎక్కువగా ఉందన్నారు. ఈ డబ్బంతా వైసిపి నేతల జేబుల్లోకే పోతోందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు వాటాలు వేసుకుని ఇసుకను దోచేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల కనుసన్నుల్లోనే ఇసుకదోపిడీ జరుగుతోందన్నారు. వాహనాలను పంచుకుని మరీ దోచేస్తున్నారని విమర్శించారు. 

ఇసుక కొరతతో 20లక్షల కార్మికుల ఉపాధికి గండికొట్టారని ఆరోపించారు. సెంట్రింగ్, కార్పెంటరీ, తాపీ కార్మికుల పొట్టకొట్టారని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సామాన్యులపై ఎలాంటి భారం పడకుండా చూశామని అయితే వైసిపి ప్రభుత్వం మాత్రం సామాన్యులపై మోపలేని భారం వేస్తోందని ఆరోపించారు.  

ఇసుకపైనే అన్నిరకాల నిర్మాణ పనులు ఆధారపడి ఉంటాయని తెలిసి కూడా ఇసుక కొరత సృష్టించి నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారని ఆరోపించారు. వైసిపి తప్పుడు పనుల వల్లే ప్రజల్లో అశాంతి, అభద్రతా భావం ఏర్పడిందన్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ టెర్రరిజం ఉందని ప్రముఖ వ్యాపార వేత్త మోహన్ దాస్ పాయ్ అన్నారని గుర్తు చేశారు. పాయ్ వ్యాఖ్యలు మన రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పట్టాయని చెప్పుకొచ్చారు. 

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు దౌర్జన్యాలే వైసీపీ ప్రభుత్వం టెర్రరిజానికి రుజువు అంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ కార్యకర్తలను భూములు సాగు చేయనివ్వడం లేదు. వారిఇళ్లపై సామూహిక దాడులకు పాల్పడుతున్నారంటూ ధ్వజమెత్తారు. 

బెదిరించి ఊళ్లనుంచి వెళ్లగొడుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో వైసిపి అరాచకాలకు అంతే లేకుండా పోయిందని ఘాటుగా విమర్శించారు చంద్రబాబు నాయుడు. 

రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను అర్థాంతరంగా నిలిపివేశారని ఆరోపించారు. అంతేకాదు పిపిఏల రివ్యూ పేరుతో ఏపికి అప్రదిష్ట తెచ్చారని మండిపడ్డారు. నరేగా బిల్లులు చెల్లించకుండా నిలిపేశారని విమర్శించారు. నీరు చెట్టు బిల్లులు కూడా చెల్లించకుండా నిలిపివేశారని మండిపడ్డారు. 

ఫ్లడ్ మేనేజిమెంట్ లో వైసిపి ప్రభుత్వ వైఫల్యం వల్లే వరద బీభత్సం సృష్టించిందన్నారు. వరద బాధితులకు సహాయ చర్యల్లో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. వరద బాధితులకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.