కనకదుర్గ ఆలయంలో అధికారులు, సిబ్బంది తీరుపై మంత్రి కొట్టు సత్యనారాయణ క్లాస్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనకదుర్గ ఆలయంలో కొందరు అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనకదుర్గ ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం వసతులు, సౌకర్యాలు కల్పించినప్పటికీ.. అవి ఏ మూలకు సరిపోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కొందరు అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. ఆలయంలో పోలీసులు, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు .. భోజనాలు, దర్శనాల విషయంలో అజమాయిషీ చేస్తుండటం ఆయన దృష్టికి రావడంతో మంత్రి క్లాస్ తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు జరిగేలా చూడాలని కొట్టు సత్యనారాయణ ఆదేశించారు.
వీఐపీ మార్గంపైనా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్‌కు, పోలీస్ కమీషనర్‌కు సైతం నోట్ పంపారు. అధికారుల సమన్వయంతో మూల నక్షత్రం రోజున కార్యక్రమం అద్భుతంగా జరిగిందని కొట్టు సత్యనారాయణ ప్రశంసించారు. కానీ కిందిస్థాయిలో పోలీసులు, సిబ్బంది మాత్రం సమస్యలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అమ్మవారిని 2 లక్షల మంది భక్తులు దర్శించుకోగా.. సోమవారం సైతం రెండు లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని మంత్రి తెలిపారు.