అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. ముఖ్యమంత్రి ఆదేశాలతో బుధవారం అర్చకులతో మంత్రి వెల్లంపల్లి, ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లం, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్, కమిషనర్ పద్మ, ఎమ్మెల్యే విష్ణు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా జీవో నెంబర్ 76 ను అమలు చేయాలని, ధార్మిక పరిషత్ అర్చక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని అర్చక సంఘాలు కోరాయి. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సబ్ కమిటీ ఏర్పాటు చేసి త్వరలోనే అర్చకుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

దేవాలయ భూములు మరియు ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తామని, అర్చక వారసత్వ హక్కుల ప్రకారం అర్చకత్వం  కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా అర్చకత్వం నిర్వహించేందుకు. దీనికోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు తీరును పరిశీలిస్తామని వెల్లంపల్లి స్పష్టం చేశారు

కనీస ఆదాయం లేని దేవాలయాలకు అర్చక గౌరవ వేతనం  5 నుంచి 10 వేలకు పెంచడానికి చర్యలు తీసుకుంటామన్నారు. 10000 ఉన్న భృతిని 16500 పెంచుతామని.. 600 దేవాలయాల్లో దూపదీప నైవేద్య పథకం అమలవుతోందని.. దీనిని 3,600 దేవాలయాలకు వర్తించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

డి డి ఎస్ స్కీమ్ కింద ఇస్తున్న ఐదు వేల రూపాయల వేతనాన్ని 10 వేలకు పెంచుతామన్నారు. శాశ్వత ప్రాతిపదిక మీద ధార్మిక పరిషత్తు మరియు అర్చక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల తో పాటు సమానంగా హెల్త్ కార్డు, దేవాదాయ కమిషనర్ కార్యాలయం సముదాయం లో ఉన్న అర్చక సంక్షేమ భవనాన్ని నిర్మిస్తామని వెల్లంపల్లి శ్రీనివాస్ అర్చకులకు హామీ ఇచ్చారు.