ఉద్యోగ సంఘం గుర్తింపు రద్దుకు నోటీస్: హైకోర్టులో సవాల్ చేసిన సూర్యనారాయణ
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీస్ ను ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు ఏపీ వాణిజ్య పన్నుల సంఘం నేత సూర్యనారాయణ.
అమరావతి:ఏపీ ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసును ఏపీ వాణిజ్య పన్నుల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఏపీ హైకోర్టులో గురువారంనాడు సవాల్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం వాణిజ్య పన్నుల అదనపు కమిషనర్ కార్యాలయం ముందు సూర్యనారాయణ నేతృత్వంలోని సంఘం ఆందోళనకు దిగింది. ఈ ధర్నాను ప్రభుత్వం తప్పుబట్టింది. ఏపీ వాణిజ్య పన్నుల ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదని ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసును సూర్యనారాయణ ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు.
ఈ మేరకు ఈ నెల 19న ఏపీ ప్రభుత్వం సూర్యనారాయణకు నోటీసు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు సకాలంలో చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సూర్యనారాయణ నేతృత్వంలో ఉద్యోగులు గవర్నర్ ను గతంలో కలిశారు. గవర్నర్ ను సూర్యనారాయణ నేతృత్వంలో ఉద్యోగులు కలిసి ఫిర్యాదు చేయడాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ విషయమై అప్పట్లో సూర్యనారాయణకు ప్రభుత్వం షోకాజ్ నోటీస్ జారీ చేసింది .