Asianet News TeluguAsianet News Telugu

విద్యుత్ సంక్షోభంపై కమిటీ వేయండి: కేంద్రమంత్రి ఆర్కే సింగ్ కు బాలినేని లేఖ

సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా  కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన 175 మెగావాట్స్ లక్ష్యాన్ని తనకు కష్టం ఉన్నా సరే భుజానకెత్తుకోవాల్సి వచ్చిందని మంత్రి బాలినేని లేఖలో పొందుపరిచారు. 

ap electricity minister balineni srinivasreddy writes a letter to union minister rk singh
Author
Amaravathi, First Published Oct 12, 2019, 9:04 PM IST

అమరావతి: విద్యుత్ రంగంలో ఏపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. సోలార్ విద్యుత్ కొనుగోలు వల్ల రాష్ట్రానికి తీవ్రనష్టమని, సోలార్, విండ్ పవర్ కారణంగా ఏటా రూ.5వేల కోట్ల భారం పడుతుందని కేంద్ర విద్యుత్‌మంత్రి ఆర్కేసింగ్‌కు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లేఖ రాశారు. 

గత నాలుగేళ్లుగా పరిమితికి మించి సోలార్‌, విండ్‌ పవర్‌ కొంటున్నామని సోలార్‌, విండ్‌ పవర్‌కి కేంద్రం సబ్సిడీలు ఇవ్వాలని లేఖలో కోరారు. విద్యుత్‌ రంగంలో సంక్షోభాన్ని అధిగమించేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. విద్యుత్‌రంగంలో సంక్షోభానికి పరిష్కారం కోసం కేంద్రం కమిటీ వేయాలని బాలినేని శ్రీనివాసరెడ్డి లేఖ కోరారు.

సోలార్‌,విండ్‌ పవర్‌ల కోసం యూనిట్‌కు రూ.3.55 భారం పడుతోందని చెప్పుకొచ్చారు. సోలార్‌, విద్యుత్‌ పవర్‌ల కొనుగోలు కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయామని దీని వల్ల మరింత సంక్షోభం నెలకొంటుందన్నారు.  

ఏపీకి సంబంధించిన విద్యుత్‌ సరఫరా కంపెనీలు దేశంలోనే అత్యంత తక్కువ విద్యుత్ సరఫరా నష్టాలు నమోదు చేస్తూ మంచి పనితీరు కనబరుస్తున్నాయని అయితే అత్యధిక రేట్లు కారణాల వల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయని లేఖలో ప్రస్తావించారు.

విద్యుత్ రంగంలో ప్రస్తుతం ఉన్న సంక్షోభాన్ని అధిగమించడానికి విద్యుత్‌ సరఫరా కంపెనీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి సోలార్‌, విండ్‌ పవర్‌ల కంపెనీలతో నిరంతరాయంగా చర్చలు జరుపుతోందని తెలిపారు. 

రాష్ట్రంలో ఏడాదికి 60 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటే అందులో 15వేల మిలియన్ యూనిట్లు సోలార్‌, విండ్ పవర్‌లదేనని చెప్పుకొచ్చారు. ఫలితంగా ఏడాదికి రూ.5300 కోట్లు నష్టం వాటిల్లుతుందని లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు కొనుగోలు రూపంలో ప్రతి సోలార్‌, విండ్‌ పవర్‌ యూనిట్‌కు రూ.4.84 కన్నా ఎక్కువ చెల్లిస్తోందని స్పష్టం చేశారు. 

గడిచిన నాలుగేళ్లుగా నిర్ణయించిన పరిమితికి మించి సోలార్‌, విండ్ పవర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దాంతో జెన్‌కో విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించి, సోలార్‌, విండ్‌ పవర్‌ ల కోసం అధిక భారాన్ని మోస్తున్నామని స్పష్టం చేశారు. 

చిన్న ఆర్థిక వ్యవస్థ ఉన్న రాష్ట్రానికి ఇది తీవ్ర నష్టంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా ప్రత్యామ్నాయ, సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా  కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన 175 మెగావాట్స్ లక్ష్యాన్ని తనకు కష్టం ఉన్నా సరే భుజానకెత్తుకోవాల్సి వచ్చిందని మంత్రి బాలినేని లేఖలో పొందుపరిచారు. 

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సబ్సిడీల కోసం సంక్షేమ పథకాలు ప్రకటించిన విధంగానే కేంద్రం కూడా సోలార్‌, విండ్ పవర్ ప్రమోషన్‌లో భాగంగా సబ్సిడీలు కల్పిస్తే బాగుంటుందని సూచించారు.
 
మరోవైపు  విభజన నాటికి  ఆస్తులు పంపిణీ చేయకుండా కేవలం అప్పులు మాత్రమే పంపిణీ జరిగిందని ఫలితంగా రాష్ట్ర ప్రజలకు భారంగా మారిందని తెలిపారు. అధిక విద్యుత్‌ ధరల మీద ఏపీ డిస్కంలు ఎన్‌సిఎల్‌టి ను ఆశ్రయించడమో, ఇప్పటికే అధికంగా ఉన్న ధరలను ఇంకా పెంచి వినియోగదారులపై భారాన్ని మోపడం కూడా సమంజసం కాదన్నారు. 

ఈ సంక్షోభానికి సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారం చూపేందుకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి నేతృత్వంలో కేంద్ర సాంప్రదాయేతర ఇంధన వనరులు శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రధానకార్యదర్శి, ఏపి ఇంధన శాఖ కార్యదర్శిలతో కూడిన కమిటీ వేయాలని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios