జనసేన రెబల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు భారీ షాక్ తగిలింది. అత్యుత్సహంతో ఆయన చేసిన వ్యాఖ్యలు చిక్కులు తెచ్చిపెట్టాయి.
జనసేన రెబల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు భారీ షాక్ తగిలింది. అత్యుత్సహంతో ఆయన చేసిన వ్యాఖ్యలు చిక్కులు తెచ్చిపెట్టాయి. ఇటీవల దొంగ ఓట్లే తన విజయానికి సహకరించాయని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందించింది. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై విచారణ చేసి వారం రోజుల్లో నివేదిక కోనసీమ జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. రాపాక వరప్రసాదరావు చేసిన వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై రాజోలుకు చెందిన వెంకటపతి రాజ అనే వ్యక్తి ఈ మెయిల్ ద్వారా పిర్యాదు చేయడంతో ఈసీ ఈ విధంగా చర్యలు చేపట్టింది.
అసలేం జరిగిందంటే..
దొంగ ఓట్లతోనే తనకు మెజారిటీ వచ్చిందని రాపాక చెబుతున్న వీడియో ఒకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఒక సందర్భంలో రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ.. తన సొంత ఊరులో చింతలమోరులో తనకు దొంగ ఓట్లు వేశారని అన్నారు. చింతలమోరులో కాపు ఓట్లు ఉండవని.. అన్ని ఎస్సీ ఓట్లే ఉంటాయని చెప్పారు. ఎవరూ ఎవరికి తెలియదని.. ఎవరూ ఎటు నుంచి వచ్చినా అక్కడేం చేయలేరని అన్నారు. సుభాష్‌తో పాటు వారి జట్టు వచ్చేసి.. ఒక్కొక్కరు ఐదారు ఓట్లేసేవారని అన్నారు. 15 నుంచి 20 మంది వచ్చేవాళ్లను.. ఒక్కొక్కరు పదేసి ఓట్లేసేవారని చెప్పారు. తన గెలుపుకు అప్పటి నుంచి కారణం అదేనని.. మెజారిటీ ఏడు, ఎనిమిది వందలు వచ్చేదని అన్నారు.
అయితే తన వ్యాఖ్యలపై రాపాక వరప్రసాద్ తాజాగా వివరణ ఇచ్చుుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దొంగ ఓట్లు వేశారని తాను చెప్పలేదని.. ఎప్పుడో 32 ఏళ్ల క్రితం జరిగిన దాని గురించి చెప్పానని అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. బొంతు రాజేశ్వరరావు జనసేనలోకి వెళ్లారని.. అయితే ఆయన అనుచురులు మాత్రం వైసీపీలో ఉన్నారని.. వాళ్ల కోరిక మేరకే ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు.
గత ఎన్నికల్లో ఎస్సీలో కొంతమందిని మినహాయిస్తే అందరూ వైసీపీకే ఓటు వేశారని చెప్పారు. అప్పుడు అయితే తనకు ఓట్లు వేసింది జనసైనికులేనని అన్నారు. టీడీపీని విమర్శిస్తే జనసైనికులు ఎందుకు ఆందోళనకు దిగారని ప్రశ్నించారు. 32 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను మాత్రమే తాను చెప్పానని.. కానీ వక్రీకరించారని మండిపడ్డారు. అప్పుడు కూడా వాళ్లు వేశామని చెబితే.. తాను వేయించలేదు కదా అని నవ్వేసి ఊరుకునేవాడినని అన్నారు.
