అమరావతి: సాంకేతికతను జోడించి తద్వారా విజ్ఞానాన్ని అర్జించే క్రమంలో  భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఈ –లెర్నింగ్ యాప్ “అభ్యాస” ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆవిష్కరించారు. వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబర్ లో మంత్రి గురువారం విద్యాశాఖ అధికారులతో కలిసి ఈ యాప్ ఆవిష్కరించారు.   

కోవిడ్-19, లాక్ డౌన్ లాంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే విద్యాసంవత్సరం ముగియడం, పదవ తరగతి పరీక్షలు వాయిదా పడటం జరిగింది. ఇలాంటి క్లిష్ట సమయంలో చిన్నారుల భవిష్యత్ పాడవకుండా ఉండేందుకు, ఇంట్లో సమయాన్ని గుణాత్మకంగా ఉపయోగించుకోవడానికి ఉపాధ్యాయులకు, ఒకటి నుండి ఐదవ తరగతి విద్యార్థుల అక్షరాస్యత మరింత మెరుగుపడేందుకు బ్రిడ్జి కోర్సులను ప్రారంభించాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిందే ఈ సెల్ఫ్ లెర్నింగ్ యాప్ “అభ్యాస”.

ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అభ్యాస యాప్  డౌన్ లోడ్ చేసుకొంటే అధిక సంఖ్యలో వీడియోలు, జనరల్ ఇంగ్లీష్ మరియు గణితం, భౌతిక, జీవ, సాంఘీక శాస్త్రాలకు లకు సంబంధించిన పాఠాలను వీడియోలుగా రూపొందించి పొందుపరచడం జరిగింది. అదే విధంగా ఆన్ లైన్ పరీక్షలు అందుబాటులో ఉంటాయి. 

కోవిడ్ -19 నేపథ్యంలో సామాజిక దూరం మరియు స్వీయ నిర్భందం తప్పనిసరి అయిన నేపథ్యంలో ఈ స్వీయ అభ్యాస యాప్ రూపొందించబడింది. స్వీయ అభ్యసన ద్వారా సంగ్రహణ శక్తి పెరుగుతుండటంతో ఎవరికివారు స్వీయ అభ్యసన చేయడం ద్వారా, వినడంతో పాటు చూడటం వల్ల సత్ఫలితాలు వస్తాయని అభ్యాస యాప్ కు రూపకల్పన జరిగింది. 

అదే విధంగా విద్యాశాఖ ఒక యూట్యూబ్ ఛానల్ ను రూపొందించింది. https://www.youtube.com/channel/UCs0eQ0LEFBbW2PsHEjUBYw/videos లింక్ ఓపెన్ చేయడం ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు విశ్రాంతి సమయంలో ఇంగ్లీష్ మరియు అభ్యాస పద్ధతులను మెరుగుపరుచుకోవడమే గాకుండా జ్ఞానాన్ని పొందవచ్చు.  దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోల్లో వచ్చిన పునర్విమర్శ(రివిజన్) తరగతులు ఈ యాప్ లో అదనంగా  లభ్యమవుతాయి.

అభ్యాస యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్(ఎస్ పీడీ), స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ చినవీరభద్రుడు, ఇంగ్లీష్ మీడియం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి కుమారి విక్టరీసెల్వీ, పాఠశాల విద్య ప్రభుత్వ సలహాదారు మురళి, ఇతర అధికారులు, సంబంధిత ఇంజినీర్లు పాల్గొన్నారు.