ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీలంకలో బాంబు పేలుళ్లు, ఇస్లామిక్, వామపక్ష తీవ్రవాదులు దేశంలోకి చొరబడ్డారంటూ కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో ఠాకూర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.  అలాగే తీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరంగా ఉండాలని, వాహనాలు, హోటళ్లలో తనిఖీలు పెంచాలని సూచించారు.

మరోవైపు ఈ నెల 23న ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి కూడా ఆయన జిల్లా ఎస్పీలకు పలు సూచనలు చేశారు. ఈస్టర్ పర్వదినం నాడు శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇస్లామిక్ తీవ్రవాదులు జరిపిన పేలుళ్లలో సుమారు 350 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కొందరు ఉగ్రవాదులు తూత్తికుడి, కన్యాకుమారి తీరం గుండా భారత్‌లోకి ప్రవేశించారని ఐబీ దక్షిణాది రాష్ట్రాలను హెచ్చరించింది.