డబ్బు కోసమే విశాఖ ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేశారని అన్నారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్రంలో క్రైమ్ రేట్ బాగా తగ్గిందని.. డ్రగ్స్ రవాణా, గంజాయిని నియంత్రించామని చెప్పారు. విశాఖ కిడ్నాప్ ఘటనను రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముడిపెట్టొద్దని ఆయన హితవు పలికారు.
విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్యా , కుమారుడు కిడ్నాప్ అయిన వ్యవహారంపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఎంపీ కుటుంబ సభ్యుల నుంచి నిందితులు రూ.1.75 కోట్ల నగదు వసూలు చేశారని డీజీపీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం వారి నుంచి రూ.86.5 లక్షలు స్వాధీనం చేసుకునట్లు రాజేంద్రనాథ్ వెల్లడించారు.
తొలుత ముగ్గురు నిందితులు ఎంపీ ఇంట్లోకి చొరబడి ఆయన కుమారుడు శరత్‌ను బెదిరించారని చెప్పారు. ఆయనను బంధించి, కత్తులతో బెదిరించారని డీజీపీ పేర్కొన్నారు. ఆ తర్వాతి రోజు ఎంపీ సతీమణి జ్యోతికి శరత్‌తో ఫోన్ చేసి పిలిపించి.. ఆమెను కూడా ఇంటికి రప్పించి బంధించారని తెలిపారు. అనంతరం ఆడిటర్ జీవీని కూడా పిలిపించి ఆయనను కట్టేసి బెదిరించారని.. ఇదే సమయంలో ఇంట్లో వున్న రూ.15 లక్షలు తీసుకున్నారని.. ఆ వెంటనే మరో 60 లక్షలను ట్రాన్స్‌ఫర్ చేయించుకునన్నారని డీజీపీ తెలిపారు. అక్కడితో ఆగకుండా ఆడిటర్ జీవీని హింసించి ఆయన నుంచి మరో రూ.కోటి తెప్పించుకున్నారని రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.
డబ్బు కోసమే ఈ కిడ్నాప్ జరిగిందని.. దీని వెనుక ఇతరత్రా కారణాలు ఏవి లేవని డీజీపీ స్పష్టం చేశారు. కిడ్నాపర్ హేమంత్‌పై హత్య, కిడ్నాప్‌లు వంటి 12 కేసులు వున్నాయని ఆయన తెలిపారు. అతనిపై త్వరలోనే పీడీ యాక్ట్ చేస్తామని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి శిక్ష పడేలా చేస్తామని డీజీపీ వెల్లడించారు. ఎంపీ కుమారుడు, భార్యా, ఆడిటర్ కిడ్నాప్ అయినట్లు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వేగంగా స్పందించారని ప్రశంసించారు. గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను పట్టుకున్నామని ఆయన చెప్పారు. పోలీసులు వెంటాడుతున్నట్లు తెలుసుకున్న నిందితులు ఎంపీ కుటుంబ సభ్యులతో పాటు కారులో పరారయ్యేందుకు ప్రయత్నించారని డీజీపీ తెలిపారు.
ALso Read: విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ వెనక విజయసాయి రెడ్డి...: బోండా ఉమ సంచలనం
ఈ క్రమంలోనే పద్మనాభం సీఐ చాకచక్యంగా వ్యవహరించి.. ముగ్గురు నిందితులు హేమంత్ , రాజేశ్, సాయిని అరెస్ట్ చేశారని చెప్పారు. మరో ముగ్గురు పరారీలో వున్నారని.. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని డీజీపీ పేర్కొన్నారు. పోలీసులు అలెర్ట్‌గా వున్నారు కాబట్టే గంటల వ్యవధిలోనే వారిని పట్టుకోగలిగామని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ బాగా తగ్గిందని.. డ్రగ్స్ రవాణా, గంజాయిని నియంత్రించామని చెప్పారు.
సరిహద్దు రాష్ట్రాల నుంచే ఏపీలోకి డ్రగ్స్ వస్తున్నాయని వీటిని కూడా అడ్డుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలను వెంటనే ఛేదించి, శిక్షలు పడేలా చూస్తున్నామని రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఎంపీకి.. కాంట్రాక్ట్‌ల విషయంలో నిందితుడు హేమంత్‌కు మధ్య విభేదాలు వచ్చాయన్న దానిపై విచారణ చేస్తున్నామని డీజీపీ పేర్కొన్నారు. విశాఖ కిడ్నాప్ ఘటనను రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముడిపెట్టొద్దని ఆయన హితవు పలికారు.
