అమరావతి: కరోనా మహమ్మారి కట్టడికి అమలుచేస్తున్న నిబంధనలు ఉల్లంఘించే వైన్ షాపులపైనే కాదు మద్యం కొనుగోలుదారులపై కఠినంగా వ్యవరించనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. మూడో విడత లాక్ డౌన్ కొనసాగింపులో భాగంగా దేశవ్యాప్తంగా కొన్ని సడలింపులు చేస్తూ మద్యం విక్రయాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపిలో సోమవారం నుండి వైన్ షాపులు తెరుచుకున్నారు. అయితే చాలారోజుల తర్వాత వైన్ షాప్ లు తెరుచుకోవడంతో మద్యం ప్రియులు  కరోనా కోసం అమలుచేస్తున్న నిబంధనలను ఉళ్లంఘిస్తూ ఒక్కసారిగా ఎగబడ్డారు. 

రాష్ట్రవ్యాప్తంగా పలు వైన్ షాపుల వద్ద కిలోమీటర్ల మేర ఎలాంటి మాస్కులు లేకుండా, సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా మందుబాబులు హంగామా సృష్టించారు. వీటన్నింటిని దృష్ట్యా మరింత కఠినంగా వ్యవహరించాలని ఏపి పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఉన్నతస్థాయి పోలీస్ అధికారులతో, ప్రభుత్వంతో చర్చించిన డిజిపి కీలక నిర్ణయం తీసుకున్నారు. 

మద్యం కొనుగోలుదారులు ఖచ్చితంగా  నిబంధనల పాటించాలని... అలాగే నిర్ణీత సమయంలోనే షాపుల వద్ద క్రమపద్దతిలో విక్రయాలు జరపాలి సూచించారు.  మద్యం కొనుగోలుకు వచ్చే వారు ఖచ్చితంగా దుకాణాల వద్ద  భౌతిక దూరం పాటించాలని, ఖచ్చితంగా మాస్క్ ధరించాలన్నారు. మద్యం దుకాణల వద్ద గుంపులు గుంపులుగా గుమికుడరాదని  తెలిపారు. నిభందనలు అతిక్రమించిన షాపులను తక్షణమే మూసివేస్తామని డిజిపి వెల్లడించారు.

అదే విధంగా మద్యం సేవించి గొడవలకు దిగడం,ఇతరులను వేదించడం, వివాదాలకు కారణమవడం, ప్రశాంతమైన వాతావరణానికి భంగం  కల్పించే విధంగా వ్యహరించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాంటివారిపై జాతీయ విపత్తు చట్టం కింద కఠిన చర్యల తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా అలాంటివారిపై అనునిత్యం ప్రత్యేక నిఘా ఉంటుందని డిజిపి గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.