Asianet News TeluguAsianet News Telugu

ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిపై మామ ఆరోపణలు: కొడుకు కూడా...

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణిపై ఆమె మామ, వైసీపీ నేత శత్రుచర్ల చంద్రశేఖర రాజు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ... ఆమెపై సొంత పార్టీకే చెందిన మామ(భర్త పరీక్షిత్ రాజు తండ్రి) కామెంట్స్ చేయడం యావత్ ఆంద్ర రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. 

AP Deputy CM Pamula Pushpasreevani's Father- In- Law Makes Allegations Against her, Husband Parikshit Raju Slams His Father's Allegations
Author
Vizianagaram, First Published Jun 6, 2020, 8:08 AM IST

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణిపై ఆమె మామ, వైసీపీ నేత శత్రుచర్ల చంద్రశేఖర రాజు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ... ఆమెపై సొంత పార్టీకే చెందిన మామ(భర్త పరీక్షిత్ రాజు తండ్రి) కామెంట్స్ చేయడం యావత్ ఆంద్ర రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. 

శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు మీడియాతో మాట్లాడుతూ... కోడలు, డిప్యూటీ సీఎం  పుష్పశ్రీవాణి సొంత నియోజకవర్గమైన కురుపాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ ఆరోపించారు. 

రోడ్డు సదుపాయం, తాగునీరు, పెన్షన్ల విషయంలో స్థానిక వైసీపీ నాయకులు విఫలమయ్యారంటూ పుష్పశ్రీవాణిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి వ్యాఖ్యలపై, కురూపం వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి భర్త పరీక్షిత్ రాజు ఫైర్ అయ్యారు. 

ఆయన మీడియా సమావేశం నిర్వహించి, తండ్రి శత్రుచర్ల చంద్రశేఖర్ వ్యాఖ్యలను ఖండించారు.  ప్రతిపక్షం కూడా ప్రశ్నించలేని వాతావరణంలో వైసీపీ నేతలు పనిచేస్తుంటే... సొంత వాళ్లే ఇలా వేలి ఎత్తి చూపటం సరైన పద్ధతి కాదని, తాము అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తామని అన్నారు. 

వైసీపీ వారికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నామని తన తండ్రి ఆరోపించినట్టు తాము వ్యవహరించటం లేదని పరీక్షిత్ రాజు స్పష్టం చేశారు. ఇకపోతే చంద్రశేఖర రాజు కేవలం కోడలిపైన్నే కాకుండా, ఏకంగా వైసీపీ ప్రభుత్వం పైన్నే ఆరోపణలు చేసాడు. 

వైసీపీకి అనుకూలంగా లేని పేదలెవ్వరికి కూడా, అర్హత ఉన్నప్పటికీ పెన్షన్లు ఇవ్వడం లేదని, జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అవకాశం ఉన్నా... ఇప్పటి వరకు ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదని ఆయన ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. 

జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, జగన్‌లా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ చేయలేదని, ఆయన పాలన బాగుండేదని స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిపై ప్రశంసలను కురిపించారు. 

వైఎస్సార్ హయాంలో పార్టీలకు, కులాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇచ్చేవారని, ఇప్పుడు అర్హులైన పేదలెవరికీ ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని తీవ్ర ఆరోపణలను చేసారు. 

సంక్షేమంపై వైసీపీ ప్రభుత్వానికి అవగాహన లేదని, రాజశేఖర్ రెడ్డి కాలంలో ఇలా ఉండేది కాదని అయన జగన్ పాలనపై ధ్వజమెత్తారు. ఇటు కోడలు పుష్ప శ్రీవాణిపై, అటు వైసీపీ ప్రభుత్వంపై సొంత పార్టీ సీనియర్ నేత చంద్రశేఖరరాజు విమర్శలు గుప్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios