విజయనగరం: ఏపీ డిప్యూటీ సీఎం, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, తన భర్తను చంపేందుకు తన పెద్దమామ మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు ప్రయత్నించారని ఆరోపించారు. 

ఈ ఏడాది ఏప్రిల్ 11న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను, తన భర్తను చంపేందుకు దగ్గర ఉండి మరీ స్కెచ్ వేశారని ఆరోపించారు. ఓ ప్రముఖ ఛానెల్ తో మాట్లాడిన ఆమె తాను కోడలు వరుస అవుతానని, తన భర్త కొడుకు అవుతాడని కూడా చూడలేదన్నారు. 

రాజకీయ పార్టీలు వేరు అయినా బంధుత్వం ఉందని దానికి కూడా విలువ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కురుపాం నియోజకవర్గంలో పెద్దకొదుమలో రిగ్గింగ్ జరుగుతుందని తెలిస్తే అడ్డుకోవడానికి వచ్చిన తమను అక్కడ జెడ్పీటీసీతో కలిసి ఒక గదిలో బంధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరోజు మూడు వేల మందితో తమను అంతం చేయాలని ప్రయత్నించారని అదృష్టం కొద్దీ బయటపడ్డామని తెలిపారు. ఇది తనకు పునర్జన్మ అంటూ స్పష్టం చేశారు ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి. తనపై చేసిన దాడికి ప్రజల తీర్పే సరైన గుణపాఠం అని భావించానని రిజల్ట్స్ వచ్చిన తర్వాత తాను అనుకున్నది నిజమైందని పాముల పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు.