విజయవాడ:స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది కోవిడ్ రోగులు మరణించిన ఘటనపై సమగ్ర విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేసినట్టుగా ఏపీ డీప్యూటీ సీఎం ఆళ్లనాని ప్రకటించారు. 

ఆదివారం నాడు మధ్యాహ్నం ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని మీడియాతో మాట్లాడారు.అంతకుముందు మంత్రులు జిల్లా కలెక్టరేట్  లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష నిర్వహించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 

also read:విజయవాడ కోవిడ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం: స్వర్ణ ప్యాలెస్, రమేష్ ఆసుపత్రిపై కేసులు

ఈ ఘటనలో 10 మంది చనిపోయారని మంత్రి తెలిపారు.   ఆరోగ్య శ్రీ డైరెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసినట్టుగా ఆయన తెలిపారు. 48 గంటల్లో కమిటి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టుగా ఆయన వివరించారు.

ఈ ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని తేలితే బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు.  ఈ ప్రమాదానికి ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం ఉన్నట్టుగా ప్రాథమిక నివేదికలో తేలిందన్నారు. 

21 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు. హోటల్ లో పనిచేసే ఆరుగురు సిబ్బంది కూడ తమ ఇళ్ల వద్దే సురక్షితంగా ఉన్నారని ఆయన చెప్పారు.

మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారని ఆయన వివరించారు.  ఉదయం 4:45 గంటలకు ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన హోటల్ సిబ్బంది ఫైర్ సిబ్బందికి ఉదయం 5:09 గంటలకు ఫిర్యాదు చేసినట్టుగా ఆయన తెలిపారు. ఈ ఫిర్యాదు అందిన వెంటనే ఉదయం 5:13 గంటలకు ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొన్నారని మంత్రి వివరించారు.హోటల్ లో ని 18 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని  మంత్రి తెలిపారు.