Asianet News TeluguAsianet News Telugu

ముంచుకొస్తున్న ‘మాండూస్’ ... అప్రమత్తమైన యంత్రాంగం, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాట్లు : ఏపీ సీఎస్

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తుపానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తుఫానును ఎదుర్కోవడానికి ఏపీ అధికార యంత్రాంగం సర్వ సన్నద్ధంగా వుంది. 

ap cs jawahar reddy review meeting on Cyclone Mandus
Author
First Published Dec 6, 2022, 8:01 PM IST

తుఫానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా వున్నామన్నారు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి. ఆయా జిల్లాల్లోని అధికార యంత్రాంగాలను అప్రమత్తం చేశామని చెప్పారు. మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని.. జవహర్ రెడ్డి పేర్కొన్నారు. 11 ఎస్టీఆర్ఎఫ్, 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో వుంచినట్లు సీఎస్ చెప్పారు. 

కాగా... బంగాళాఖాతంలో కొద్దిరోజులుగా వాయుగుండం ఏర్పడుతుందనుకుంటే… అది కాస్త తుఫానుగా బలపడింది. దీంతో వాతావరణ శాఖ తుపాను హెచ్చరికలు చేస్తోంది. ఈ వాయుగుండం తుఫానుగా మరి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపు ప్రయాణించనుంది. దీని ప్రభావం  తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉండనుంది. సోమవారం ఉదయం దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది.

మంగళవారం సాయంత్రానికి ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత అదే దిశలో పయనిస్తోంది. తుఫానుగా బలపడి.. నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. భారత వాతావరణ విభాగం సోమవారం దీని గురించి చెబుతూ… ఈ తుపాను ఈ నెల 8వ తేదీ ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి-దక్షిణ కోస్తాంధ్ర సమీపంలో తీరానికి చేరుతుందని తెలిపింది.

ALso REad:ముంచుకొస్తున్న ‘మాండూస్’ !.. తుపానుగా మారనున్న వాయుగుండం..

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఈ తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. ఉత్తర కోస్తాలో కాస్త తక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు,నెల్లూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక దక్షిణ కోస్తాలో గురువారం  పలుచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది.గురువారం నాడే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది.

ఆ తరువాత శుక్రవారంనాడు దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని… చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో చెదురుమదురుగా ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 8, 9 తేదీలలో వాయుగుండం, తుఫాను ప్రభావంతో కోస్తాలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. వీటి ప్రభావం వల్ల మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని  విశాఖ పట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచించింది.

వాయుగుండం బలపడి తుఫానుగా రూపాంతరం చెందాక దీనికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  సూచించిన ‘మాండూస్’ అని పేరు పెట్టనున్నారు. వాయుగుండం తుఫానుగా మారిన తర్వాత ఈ పేరును అధికారికంగా ప్రకటిస్తారు. దీని వెంటనే మరో అల్పపీడనం ముందుకు రానుంది.  ఈనెల 15వ తేదీన దక్షిణ బంగాళాఖాతంలో అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలుస్తోంది. దీని ప్రభావం ఈ నెల 20వ తేదీ వరకు ఉండనుంది. ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో అల్ప పీడనాలు ఏపీ తీరాల వైపు కదలడం లేదని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios