రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువులు, పెట్రోల్ డిజిల్ ధరలకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనకు ఏపీ కాంగ్రెస్ సిద్దమయ్యింది. ఈ మేరకు ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి కీలక ప్రకటన చేసారు.
గుంటూరు: తెలంగాణలో మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ (appcc) దూకుడు పెంచింది. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై, ఏపీలో పెరిగిన నిత్యావసర ధరలు, పెట్రోల్ డిజిల్ (petrol diesel prices) ధరల పెంపుపై ఏపీలో ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ సిద్దమయ్యింది. ఈ క్రమంలోనే రేపు(గురువారం) రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసనలు చేపట్టాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి కీలక ప్రకటన చేసారు.
''కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. ఇలా నిత్యం ఉపయోగించే వస్తువుల ధరలు పెంచి భారం మోపడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి పెంచిన నిత్యావసర ధరలు పెంచాలన్న డిమాండ్ తో ఏపీ కాంగ్రెస్ పార్టీ నిరసనలకు సిద్దమయ్యింది'' అని మస్తాన్ వలీ తెలిపారు.
''మార్చి 31న రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమాల్లో జాతీయస్థాయి కాంగ్రెస్ నాయకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాల్గోంటారు'' అని మస్తాన్ వలీ వెల్లడించారు.
''ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో భారతీయుల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమయ్యింది. ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తామని కల్లబొల్లి మాటలతో ప్రజలను నమ్మించి... ఇప్పుడు అధికారంలో వచ్చాక అమాంతం ధరలను పెంచడం దారుణం'' అంటూ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆందోళన వ్యక్తం చేసారు.
''ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం కేవలం పెట్రోల్, డీజిల్ ద్వారానే రూ.26లక్షల కోట్ల ప్రజల ధనాన్ని దోచుకుంది. అయినా చాలదన్నట్లు ఇంకా వీటి ధరలు పెంచుతూనే వుంది. ఈ ధరల పెంపుకు స్వస్తి పలుకుతూ పెట్రోల్, డిజిల్ ను జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలి. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి'' అని డిమాండ్ చేసారు.
''ఏపీ రాజధాని అమరావతి విషయంలోనూ బీజేపీ రెండుకళ్ళ సిద్ధాంతం అమలు చేస్తోంది. కేంద్ర అమరావతి విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం కూడా వెనక్కి తగ్గుతుంది. కానీ ఓవైపు అమరావతికి మద్దతిస్తామంటూనే మరో వైపు వైసిపి మూడురాజధానుల నిర్ణయానికి కూడా మద్దతిస్తోంది'' అని అన్నారు.
''రాజ్యాంగబద్దమైన కోర్టు తీర్పులను కూడా వైసిపి ప్రభుత్వం గౌరవించడం లేదు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా మాట్లాడే ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రమే. గతంలో కూడా వైసిపి నాయకులు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఏకంగా కోర్టు తీర్పులపైనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు'' అని ఆరోపించారు.
''వైసిపి ప్రభుత్వానికి పాలన చేతగాక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారు. ఇప్పటికే లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం మరిన్ని అప్పులకోసం ప్రయత్నిస్తోంది. జగన్ రెడ్డి ప్రభుత్వం ఇంత అప్పు ఎందుకు చేసారని యువత ప్రశ్నించాలి'' అని ఏపీ పిసిసి అధ్యక్షులు మస్తాన్ వలీ సూచించారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై కూడా కాంగ్రెస్ పోరుకు సిద్దమవుతుంది. ఏప్రిల్ నెలంతా ఉద్యమాలు చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం నిర్ణయించింది. ఏప్రిల్ చివరి వారంలో వరంగల్ కేంద్రంగా రైతు బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ బహిరంగ సభకు ఎంపీ రాహుల్ గాంధీని ఆహ్వానించి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టాలని తీర్మానించింది.
