న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయూతనందిస్తూ నవరత్నాలుతోపాటు పలు సంక్షేమ పథకాలకు, ప్రాజెక్టులకు ఉదారంగా సాయం చేయాలని కోరారు. 

ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి అమిత్ షా తో భేటీ అయిన సీఎం జగన్ విభజన హామీలను నెరవేర్చాలని కోరారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి అండగా నిలవాలని అమిత్‌షాను అభ్యర్థించారు. 

నవరత్నాలు వంటి పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు భారీ కార్యక్రమాలను చేపట్టామని అందుకు కేంద్ర సహకారం అందించాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. రెవెన్యూ లోటు భర్తీతోపాటు వెనుకబడిన జిల్లాలకు నిధులిచ్చి ఉదారంగా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో  సీఎం  జగన్‌ సుమారు గంటసేపు సమావేశమయ్యారు. అమిత్‌ షాను మంగళవారం మధ్యాహ్నమే కలవాల్సి ఉంది. అయితే పార్లమెంట్ లో జమ్ముకశ్మీర్ విభజన బిల్లుపై చర్చ ఉన్న నేపథ్యంలో కలవడం వీలుకుదరలేదు. 

దాంతో బుధవారం రాత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు సీఎం జగన్. విభజన హామీల అమలుకు హోంశాఖ నోడల్‌ వ్యవస్థగా ఉన్నందున విభజన హామీలన్నీ అమలయ్యేలా చూడాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.