రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం టీకాల కొరత వేధిస్తున్న వేళ ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి ఘాటు లేఖ రాశారు.  రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు.

అయితే ప్రస్తుతం టీకా కొరతతో 45ఏళ్లు పైబడిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నామని.. 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి టీకా ప్రక్రియ ప్రారంభించలేకపోయామని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా ధరలు వేర్వేరుగా ఉన్నాయని, ఒక్కో డోసుకు రూ.2వేల నుంచి 25వేలు వసూలు చేస్తున్నట్టు వెల్లడించారు.

Also Read:చిత్తూరు, ఉభయగోదావరిల్లో మృత్యుఘోష... ఏపీలో కొత్తగా 19,981 కేసులు

ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా.. జనంలోకి తప్పుడు సంకేతాలు ఇస్తోందని, ప్రభుత్వ నియంత్రణ లేకుంటే టీకాలను నల్లబజారుకు తరలిస్తారని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

వ్యాక్సిన్ల కొరత అంటూనే ప్రైవేటుకు ఎలా ఇస్తారని జగన్ ప్రశ్నించారు. దీనివల్ల సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని ప్రధానికి వివరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు దేశంలో టీకా కార్యక్రమం జరగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.