అమరావతి : ఈనెల 29న క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్రీడాకారులకు శుభవార్త అందించారు. క్రీడారంగంలో జాతీయ పతకాలు సాధించిన వారిని నగదు పురస్కారాలతో ఘనంగా సత్కరిస్తామని ప్రకటించారు. 

క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న ఈ పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. ‘క్రీడారంగానికి కొత్తశోభను తీసుకువస్తాం. ప్రతిభ ఎక్కడ ఉన్నా ప్రోత్సహించే బాధ్యత ఇకపై ప్రభుత్వం తీసుకుంటుందని జగన్ స్పష్టం చేశారు.

ఈ నెల 29న క్రీడాదినోత్సవం సందర్భంగా 2014 నుంచి జాతీయస్థాయిలో పతకాలు సాధించిన వారిని నగదు పురస్కారాలతో ఘనంగా సత్కరిస్తామని ఈ కార్యక్రమం ప్రతీ ఏటా నిర్వహిస్తామని జగన్ తన ట్విట్టర్ లో తెలిపారు. 

 

అంతకుముందు స్పందన కార్యక్రమంలో కూడా క్రీడారంగంపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రీడలు గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దిగువ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలని అధికారును ఆదేశించారు. 

రాష్ట్ర విభజన అనంతరం జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు నగదు బహుమతి ఇవ్వాలని ఆదేశించారు. బంగారు పతకం వచ్చిన వారికి రూ.5లక్షలు వెండి పతకం సాధించిన వారికి రూ.4లక్షలు, కాంస్య పతాకం తీసుకువచ్చిన వారికి రూ.3 లక్షలు బహుమతిగా అందజేయాలని సూచించారు. 

అలాగే జూనియర్, సబ్‌ జూనియర్‌ స్థాయి క్రీడాకారులనూ గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఈ కేటగిరీలో జాతీయ స్థాయిలో బంగారు పతకం వచ్చిన వారికి రూ.1.25లక్షలు,  వెండిపతకం సాధించిన వారికి రూ.75వేలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.50 వేలు ప్రోత్సహాక నగదు అందజేయాలని ఆదేశించారు. 

జూనియర్, సబ్ జూనియర్ క్రీడాకారులను గుర్తిస్తే వారంతా పీవీ సింధులుగా మారతారని చెప్పుకొచ్చారు. ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం రోజున ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఇకపై ఈ క్రీడా దినోత్సవ వేడుకలు వారం రోజులపాటు ఘనంగా నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు.