రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో అధికారాన్ని అందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ.. తిరుపతిలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ధన్యవాద సభ బహిరంగసభలో మోడీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. తెలుగులో ప్రసంగం ప్రారంభించారు.

శ్రీలంక పర్యటన షెడ్యూల్ కారణంగా ఆలస్యమైందని అందుకు తనను క్షమించాల్సిందిగా ప్రధాని కార్యకర్తలను కోరారు. తిరుపతికి చాలా సార్లు వచ్చానని... రెండో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరోసారి ఇక్కడకు వచ్చానని మోడీ తెలిపారు.

ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు 365 రోజులు పనిచేస్తామన్నారు. బీజేపీ ఈ స్థాయికి రావడం వెనుక కార్యకర్తల కష్టం ఎంతో ఉందని ప్రధాని గుర్తుచేశారు. అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో ప్రజలకు సేవ చేయడం కూడా అంతే ముఖ్యమన్నారు.

ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్‌కు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.. అంతేకాకుండా ఏపీ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం చేయూతనిస్తుందని మోడీ స్పష్టం చేశారు.

అంతకు ముందు . కొలంబో నుంచి వాయుసేన ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్న ప్రధానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధాని నేరుగా తిరుపతిలో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు.