సున్నా వడ్డీలపై చంద్రబాబు సభలో ప్రసంగించిన దానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కౌంటరిచ్చారు.  బాబు ప్రసంగాన్ని మొదటిసారి విన్న ఎవరికైనా చంద్రబాబు ఎంత గొప్పగా సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేశారోనని అనుకుంటారని సీఎం సెటైర్లు వేశారు.

ఎల్లో మీడియా సపోర్ట్ ఉండటంతో ఆయన ఏం చేసినా తంధానా అంటుందన్నారు. 2014-15 సంవత్సరంలో రూ. 29,658 కోట్లు పంట రుణాల కింద కేటాయించారని..రూ. 1,186 కోట్లు కడితేనే రైతులకు వడ్డీ లేని రుణాలు అందుతాయని కానీ రూ. 44.31 కోట్లు మాత్రమే చంద్రబాబు చెల్లించారని జగన్ తెలిపారు.

డబ్బు కట్టకుండా స్కీమ్ సక్సెస్ అంటే ఎలా అంటూ మండిపడ్డారు. 2015-16లో రూ. 57, 085 కోట్ల పంటరుణాల్లో రూ.2,283 కోట్లను వడ్డీ లేని రుణాలని... వీటిలో రూ. 31 కోట్లు మాత్రమే చెల్లించారని జగన్ ధ్వజమెత్తారు.

2016-17లో రూ. 58,840 కోట్లు పంటరుణాలని.. వీటిలో వడ్డీలేని రుణాలు రూ. 2,354 కోట్లు చెల్లించాలని... ప్రభుత్వం చెల్లించింది రూ. 249 కోట్లని అన్నారు. 2017-18లో రూ.67,568 కోట్లు పంటరుణాలని.. వీటిలో వడ్డీ లేని రుణాలు రూ. 2,703 కోట్లు చెల్లించాలని.. రూ.182 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లించిందన్నారు.

2018-19లో పంట రుణాలు రూ.76,721 కోట్ల పంటరుణాల్లో.. రూ. 3,069 కోట్లు వడ్డీలేని రుణాలని.. వీటికి ప్రభుత్వం రూ. 122 కోట్లు చెల్లించిందన్నారు. మొత్తం మీద రైతులకు వడ్డీ లేకుండా రుణాలు రావాలంటే రూ.11,595 కోట్లు చెల్లించాలని అయితే చంద్రబాబు కేవలం రూ. 630 కోట్లు మాత్రమేనని జగన్ స్పష్టం చేశారు.

పథకాల అమలులో మీ ప్రవర్తన.. ఇవ్వకపోయినా, ఇచ్చినట్లు చెప్పుకోవడం వల్లే టీడీపీ పరిస్థితి ఈరోజున ఇలా ఉందని జగన్ ఎద్దేవా చేశారు. ఈ సమయంలో సభలో గందరోగోళం నెలకొనడంతో సీఎం సహనం కోల్పోయారు.

వాళ్లు 23 మంది ఉన్నారని.. మా వాళ్లు 151 మంది ఒక్కసారి లేస్తే.. వాళ్లలో ఒక్కరు కూడా అక్కడ కూర్చోలేరని మండిపడ్డారు. బాడీలు పెరిగాయి గానీ.. బుద్ధి పెరగలేదంటూ అచ్చెన్నాయుడిని ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

చెవిరెడ్డి మాట్లాడుతూ.. ప్రశ్నోత్తరాల సమయంలో సబ్జెక్ట్‌ను ఎప్పుడూ టేకాఫ్ చేయలేదని.. కానీ ముఖ్యమంత్రి సున్నా వడ్డీలపై చర్చకు అంగీకారం తెలిపారన్నారు. టీడీపీ సభ్యులకు వినే ఓపిక లేదని.. గొడవ చేయటానికే వాళ్లు అసెంబ్లీకి వచ్చారని ఆయన మండిపడ్డారు.

ముఖ్యమంత్రి చెప్పిన లెక్కలు జనాల్లోకి వెళ్తే.. టీడీపీ నేతలు దోషులుగా నిలబడతారనే ఉద్దేశ్యంతోనే ప్రతిపక్షసభ్యులు చర్చ సాగనివ్వడం లేదని ధ్వజమెత్తారు.