హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వేసిన పంచ్ లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పడిపడినవ్వారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందంటూ, చంద్రబాబు రికార్డ్ బద్దలుకొట్టడం ఖాయమంటూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు వైయస్ జగన్ తెగనవ్వేశారు.

తెలుగుదేశం పార్టీకి రాష్ట్రప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అయినా ఇంకా బుద్ధి మారలేదంటూ ధ్వజమెత్తారు. గతంలో పరమానంద శిష్యులు గురించి విన్నామని నేడు నారానంద వారి శిష్యులను చూస్తున్నామని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు ఏదైనా అంటే మా బాబుగారికి అన్యాయం జరిగింది అవమానం జరిగిందంటూ ఆయన శిష్యులు చేస్తున్న హంగామా అంతా ఇంతాకాదన్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబును తనిఖీ చేయడం పెద్ద నేరంగా ఆయనకు ఏదో జరిగిపోయిందంటూ టీడీపీ కనిపిస్తున్న వారికీ, నిద్రిస్తున్న వారికి చెప్తూ పరువు తీసుకున్నారంటూ ధ్వజమెత్తారు. 

ఇలా పంచ్ లతో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ తన కేబినెట్ లో 50 శాతానికి పైగా ఎస్సీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించారని స్పష్టం చేశారు. అయితే 50 శాతం కాదని 60 శాతం అంటూ జగన్ దానిని సరిచేసే ప్రయత్నం చేశారు. మెుత్తానికి అంబటి రాంబాబు వేసిన సెటైర్లకు సీఎం వైయస్ జగన్ మాత్రం పడిపడి నవ్వుకున్నారు.