Asianet News TeluguAsianet News Telugu

సొంత పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు: ఆనంపై జగన్ ఆగ్రహం, వెంకటగిరి ఇన్‌ఛార్జ్‌గా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి..?

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వెంకటగిరి ఇన్‌ఛార్జ్‌గా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని నియమించేందుకు సీఎం జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

ap cm ys jagan serious on anam ramanarayana reddy over his comments on ysrcp govt
Author
First Published Jan 3, 2023, 5:22 PM IST

గత కొంతకాలంగా సొంత పార్టీ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న వైసీపీ సీనియర్ నేత, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా ఆయనపై వేటుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. వెంకటగిరి ఇన్‌ఛార్జ్‌గా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని నియమించేందుకు సీఎం జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనిపై నేడో, రేపో అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం వుంది. ఆనం కామెంట్లు పార్టీకి నష్టం కలిగించేలా వున్నాయని అధిష్టానం అభిప్రాయపడింది. ఇటీవల ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ఆనం తీవ్రవ్యాఖ్యలు చేశారు. గోతులు పడ్డ రోడ్లను బాగుచేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ రోజు కూడా ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తే వైసిపి ఓడిపోవడం ఖాయమని ఆయన అన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే తామంతా ఇంటికి వెళ్లడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. సైదాపురం మండలంలో సచివాలయాల నిర్మాణాలు కూడా సరిగా జరగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు వైసిపికి అధికారం ఇచ్చి నాలుగేళ్లు అవుతోందని, ఇంకా సచివాలయాల నిర్మాణం జరగలేదని ఆయన విమర్శించారు. సాంకేతిక కారణాల వల్ల నిర్మాణాలు జరగడం లేదా, బిల్లుల చెల్లింపులో జాప్యమా అనేది తెలియడం లేదని ఆయన అన్నారు. గ్రామ సచివాలయాలకు భవనాలు కూడా లేవని ఆయన గతంలో వ్యాఖ్యలు చేశారు.

వెంకటగిరి ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, 2014 వరకు ఇక్కడ తానే ఎమ్మేల్యేనని, ఏడాది తర్వాత వచ్చే ఎన్నికలకు ఇప్పుడే తన సీటుకు ఎసరు పెడుతున్నారని ఆయన అన్నారు. వెంకటగిరికి తాే రేపు ఎమ్మెల్యేనని ఓ పెద్దమనిషి చెప్పుకుంటున్నాడని, వీడు ఎప్పుడు ఖాళీ చేస్తాడా కుర్చీ లాగేద్దామని కొంత మది ఆశపడుతున్నారని ఆయన నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న రామనారాయణ రెడ్డిపై వైసిపి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పార్టీలు మారేవారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios