అమరావతి: గుండు కొట్టించడం లాంటి ఘటనలు తప్పు అని ఏపీ సీఎం వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. ఇలాంటి ఘటనలకు పాల్పడకూడదని ఆయన పోలీసులకు సూచించారు. తూర్పు గోదావరి జిల్లాలో దళితుడు ప్రసాద్ కు ఎస్ఐ శిరోముండనం చేసిన ఘటనను సీఎం జగన్ పరోక్షంగా ప్రస్తావించారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్  మంగళవారం నాడు అమరావతిలో స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు.
దళితులపై దాడులు, అక్రమ మద్యం, ఇసుక విషయంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం , ఇసుక అక్రమాలకు అరికట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. 

మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలు ఎవరూ కూడ దీనికి అతీతులు కారన్నారు.  ఎక్కడా కూడ తప్పులు జరగొద్దని ఆయన సూచించారు. రాజకీయ జోక్యం లేదని ఆయన స్పష్టం చేశారు.తప్పు ఎవరూ చేసినా కూడ తప్పేనని సీఎం చెప్పారు. ఈ సందేశాన్ని పోలీస్ అధికారులు కిందిస్థాయి వరకు తీసుకెళ్లాలని జగన్ సూచించారు.

కానిస్టేబుళ్లు, ఎఎస్ఐ, ఎస్ఐ స్థాయి వారికి ఓరియేంటేషన్ నిర్వహించాలని సీఎం కోరారు. వ్యవస్థలో మార్పు కోసమే కఠినంగా వ్యవహరిస్తున్నట్టుగా  సీఎం వివరించారు.