అవి మన పథకాలే.. పేర్లే మార్పు, అంతా పులిహోరే : టీడీపీ మేనిఫెస్టోపై కేబినెట్ భేటీలో జగన్ జోకులు
మహానాడు వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ జోకులు వేశారు. ఈ నెల 15 నుంచి ప్రభుత్వ పథకాలపై ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
మహానాడు వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోపై జగన్ జోకులు వేసినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. మనం ఇచ్చే పథకాలకు చంద్రబాబు వంకలు పెడతారని జగన్ ఎద్దేవా చేశారు. కానీ మన పథకాలకే పేర్లు మార్చి పులిహోర మేనిఫెస్టోను ప్రకటించారని సీఎం సెటైర్లు వేశారు.
ఈ నెల 15 నుంచి ప్రభుత్వ పథకాలపై ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఎన్నికలకు ఇంకా 9 నెలలే టైం వున్నందున క్షేత్రస్థాయిలో కష్టపడాలని జగన్ మంత్రులకు క్లాస్ పీకారు. ఎమ్మెల్యేల ఇబ్బందులపై ఇన్‌ఛార్జ్ మంత్రులు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. అయితే మధ్యలో మంత్రులు జోక్యం చేసుకుంటూ నియోజకవర్గాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరగా.. దీనికి చూద్దాంలే అని జగన్ ఆన్సర్ ఇచ్చారు. అలాగే విశాఖ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కూడా కోరారు. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
Also Read: కష్టపడితే మళ్లీ అధికారం మనదే: ముందస్తు ఎన్నికలపై తేల్చేసిన జగన్
మరోవైపు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్ళనున్నట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. మరో 9 మాసాల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయని సీఎం జగన్ మంత్రులకు చెప్పారు. ఈ 9 నెలల పాటు కష్టపడితే మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని మంత్రులకు జగన్ తెలిపారు. మంత్రులతో పాటు పార్టీ నేతలంతా కష్టపడాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ చెప్పారు. ఈ 9 మాసాల పాటు మీరంతా కష్టపడితే మిగిలిన అంశాలపై తాను కేంద్రీకరిస్తానని ఆయన పేర్కొన్నారు.