వచ్చే ఏడాది మార్చి 31 నాటికి రోడ్ల మరమ్మత్తులు పూర్తి చేయాలి: మున్సిపాలిటీలపై జగన్ సమీక్ష
వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను వచ్చే ఏడాదిమార్చి 31నాటికి మరమ్మత్తులు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటిల్లో మౌళికసదుపాయాలపై సీఎం జగన్ సమీక్షించారు.
అమరావతి:మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాలపై కేంద్రీకరించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం నాడు అమరావతిలో పురపాలక, పట్టణాభివృద్ది శాఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.మున్సిపాలిటీల వారీగా చెత్త శుద్ది చేసే ప్రక్రియలో ఉన్న సౌకర్యాలు, మురుగు నీటి శుద్ది కోసం ఉన్న సౌకర్యాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీల్లో మౌళిక వసతుల కల్పన కోసం నివేదికలను సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు.
కృష్ణానది వరద ముంపు రాకుండా యుద్ధ ప్రాతిపదికన రిటైనింగ్ వాల్ నిర్మించాలని
సీఎం కోరారు. ప్రతి మున్సిపాలిటీలో వేస్ట్ ప్రాసెసింగ్ ప్రక్రియ అమలు తీరును పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను ప్రభుత్వం నిషేధించినందున ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను కోరారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్లు చొరవ తీసకొని సమావేశాలు ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున పట్టణాలు, నగరాల్లో దెబ్బతిన్నరోడ్ల మరమ్మత్తులను చేపట్టాలని అధికారులను కోరారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి అన్ని రోడ్లకు మరమ్మత్తులు చేయాలని సీఎం ఆదేశించారు. గార్బేజ్ స్టేషన్ల కారణంగా పరిసరాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉండొద్దని సీఎం సూచించారు. గార్బేజ్ స్టేషన్ల నిర్వహణలోనూ అత్యుత్తమ విధానాలు పాటించాలని సీఎం కోరారు.
జగనన్న కాలనీల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు సీఎం. పెద్ద కాలనీల్లో మౌలిక సదుపాయాలకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చెప్పారు. ప్రాధాన్యతా క్రమంలో నీళ్లు, డ్రైనేజీ, కరెంటు ఏర్పాటు చేసి తర్వాత మురుగునీటి శుద్ధి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లే రహదారికి ఇరువైపులా సుందరీకరణ పనులపై అధికారులు నివేదికను సీఎంకు అందించారు. అంబేద్కర్ పార్కుకు వెళ్లే రోడ్లను అందంగా తీర్చిదిద్దాలని సీఎం కోరారు. విశాఖపట్నంలో సుందరీకరణ పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ కార్యక్రమంపై శ్రద్ధపెట్టాలని సీఎం కోరారు. ప్రతి నియోజకవర్గానికి ఒక లే అవుట్‌ను తీర్చిదిద్దాలన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి సంపత్ కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీయూఎఫ్‌ఐడీసీ ఎండీ లక్ష్మీషా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.