అమరావతి: గిరిజనులకు వరాజల్లు  కురిపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. గురువారం సెక్రటేరియట్ లో సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై రివ్యూ నిర్వహించిన సీఎం జగన్ కీలక నిర్ణయాలు ప్రకటించారు. 

రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టళ్లలో నాణ్యమైన విద్యతోపాటు ఆహారం కూడా క్వాలిటీగా ఉండాలని ఆదేశించారు. అధికారులు క్రమం తప్పకుండా హాస్టల్స్ ను తనిఖీలు చేయాలని సూచించారు. స్కూళ్లకు సంబంధించి 9 రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. 

మూడు దశల్లో సాంఘీక, గిరిజన, మైనారిటీ స్కూల్స్, హాస్టల్స్ లో తొమ్మిది రకాల సౌకర్యాలు కల్పించబోతున్నట్లు జగన్ హామీ ఇచ్చారు. రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టల్స్‌లో కూడా చేపట్టాల్సిన పనులపై ఒక ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. 

మంచాలు, బ్లాంకెట్స్‌ సహా అన్ని సౌకర్యాలూ హాస్టళ్లలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్టళ్లలో పిల్లలకు మంచాలు, దుప్పట్లు, అల్మరాలు ఉన్నాయో లేదో పరిశీలించి పూర్తి స్థాయి నివేదిక అందించాలని జగన్ ఆదేశించారు.  

మన పిల్లలను స్కూలుకు పంపిస్తున్నప్పుడు తల్లిదండ్రులుగా మనం ఎలా ఆలోచిస్తామో ప్రభుత్వం రెసిడెన్షియల్‌ స్కూళ్లు, పాఠశాలలు, హాస్టళ్లలో కూడా అలాంటి వసతులే కనిపించేలా ఆలోచన చేయాలని ఆదేశించారు. 

డిమాండు ఉన్నచోట కొత్త హాస్టళ్ల  కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. హాస్టళ్లలో వసతుల సౌకర్యంకోసం కలెక్టర్లకు నిధులు ఇచ్చారా? లేదా? అన్నదానిపై సీఎం జగన్ ఆరా తీశారు. ప్రతీ స్కూల్, హాస్టల్ లో టాయిలెట్స్ ను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదుశించారు.  

309 హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 927 వాచ్ మెన్, కుక్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి ఎట్టి పరిస్థితుల్లో స్కూలు తెరిచే సమయానికి యూనిఫామ్స్, పుస్తకాలు అందజేయాలని ఆదేశించారు. 

ప్రభుత్వ స్టడీ సర్కిళ్లను బలోపేతం:

ప్రభుత్వ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ వర్కుల్లో కచ్చితంగా యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆదేశించారు.  

వైయస్సార్‌ చేయూత కింద లబ్దిదారులను గుర్తించే పని ఇప్పటి నుంచే మెుదలు పెట్టాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు ప్రతి ఏటా రూ.18,750 అందజేయనున్నట్లు తెలిపారు. 

రాజకీయాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 

గిరిజనులకు సీఎం జగన్ వరాలు:

ఈ సందర్భంగా గిరిజనులకు సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు. సాలూరులో ట్రైబల్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. పాడేరులో ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీ, కురుపాంలో ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం జగన్. 

అలాగే 7 ఐటీడీఏల్లో సూపర్‌ స్పెషాల్టీ హాస్పటల్స్ ను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పుకొచ్చారు. అరకు, పాలకొండ, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కె.ఆర్‌.పురం, దోర్నాలలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ ను ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  

అందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే గిరిజనులకు అటవీభూములపై పట్టాలు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. ఈ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి దృష్టిపెట్టాలని చెప్పారు. ఎస్సీలకు, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు వేయనున్నట్లు తెలిపారు. 

ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ రివ్యూలో ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి, డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అంజద్ భాషా, మరో డిప్యూటీ సీఎం, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కె. నారాయణ స్వామిలు పాల్గొన్నారు.