అమరావతి: రెవెన్యూ శాఖలో లంచాలు వ్యవస్థ ఉంటే సహించేది లేదని ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లంచాల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని ఆదేశించారు. 

అమరావతిలో రెవెన్యూశాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షలో
వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా శాఖల నివేదికలపై జగన్ ఆరా తీశారు.  

ఆయా శాఖల నివేదికలను పరిశీలించిన సీఎం జగన్ వాణిజ్యపన్నుల్లో 14శాతం వృద్ధి ఉండాల్సి ఉండగా 5.3శాతానికి తగ్గడంపై ఆరా తీశారు. గడచిన నాలుగు నెలల్లో  ఆదాయంలో అనుకున్నంతమేర వృద్ధి లేదని అధికారులు వివరించారు. 

స్టీల్, ఐరన్‌ రేట్లు కూడా తగ్గడం ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. 
సిమ్మెంటు రేటు కూడా తగ్గడం వల్ల దానిమీద వచ్చే పన్నులు కూడా తగ్గుతున్నట్లు తెలిపారు. వాహన రంగంలో మందగమనం వల్ల జీఎస్టీ తగ్గిందని తెలిపారు. 

ఈ ఏడాది చివరినాటికి ఆదాయాలు మెరుగుపడతాయన్న ఆశాభావంతో ఉన్నట్లు స్పష్టం చేశారు. 
జీఎస్టీ పరిహారం కింద సెప్టెంబర్ నెల మొదటివారంలో రూ.597కోట్లు వస్తుందని సీఎం జగన్ కు వివరించారు. వాణిజ్య పన్నుల్లో 14శాతం వృద్ది ఉంటుందని తెలిపారు.  

ఇకపోతే రాష్ట్రంలో లిక్కర్‌ వినియోగం గణనీయంగా తగ్గినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు సీఎం జగన్ కు వివరించారు. 
2018–19లో 125 లక్షల కేసుల లిక్కర్‌ విక్రయం కాగా బెల్టుషాపులను తొలగించడం వల్ల 2019 జులై వరకూ 12 లక్షల కేసుల వినియోగానికి పడిపోయిందన్నారు. 


అయినప్పటికీ ప్రభుత్వ నిర్ణయం మేరకు మద్యనియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రైవేటు దుకాణాలు తొలగింపునకు రంగం సిద్ధచేసినట్లు వివరించారు. 4380 నుంచి 3500కు దుకాణాలు తగ్గిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న దుకాణాల్లో మొత్తం 20శాతం మేర దుకాణాలు తగ్గించబోతున్నట్లు చెప్పుకొచ్చారు. 

మద్యం నియంత్రణ, నిషేధానికి, మరియు డీఎడిక్షన్‌ సెంటర్లకు రూ.500 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 1 నుంచి పైలట్‌ ప్రాజెక్టు కింద 503 దుకాణాలను వినియోగంలోకి తేనున్నట్లు తెలిపారు. త్వరలో 16వేల ఉద్యోగాలు రాబోతున్నట్లు వివరించారు. 

ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ అధికారులకు కీలక సూచనలు చేశారు సీఎం జగన్. మద్య నియంత్రణ,  నిషేధం అమలుకు ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు విభాగాలను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. స్మగ్లింగ్‌ జరగకుండా, నాటు సారా తయారీ కాకుండా చూడాలని ఆదేశించారు.  

మద్యం సేవించడం వల్ల వచ్చే అనర్థాలపై పాఠ్యప్రణాళికలో ఉంచాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామ సెక్రటేరియట్‌ ఉద్యోగులకు మద్య నియంత్రణ, నిషేధంపై శిక్షణ
మద్య నిషేధం అమలుకోసం గ్రామ సచివాలయంలో మహిళా పోలీసులను వినియోగించాలని సూచించారు. మద్యపాన నిషేధంపై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని ఆదేశించారు సీఎం జగన్.