దేశంలో కరోనా పెరుగుదల నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

కోవిడ్‌ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, వాక్సినేషన్‌పై చర్చలో జగన్ పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌ ముగిశాక అధికారులతో జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

కేంద్రం చెప్పిన విధంగా ఏప్రిల్‌ 11 నుంచి 14 వరకూ చేపట్టనున్న టీకా ఉత్సవ్‌ కోసం రోజుకు 6 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఆ నాలుగు రోజులు కనీసంగా 24 లక్షలమందికి వాక్సిన్‌ ఇచ్చేలా కార్యాచరణ చేయాలన్న జగన్ సూచించారు.

Also Read:దేశంలో మళ్లీ లాక్‌డౌన్ వుండదు... కానీ : ప్రధాని మోడీ ప్రకటన

ఈమేరకు వ్యాక్సిన్‌ డోసులు కేంద్రాన్ని కోరాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికలు ముగిసినందున వ్యాక్సిన్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలన్న జగన్.. దీనికోసం అన్నిరకాలుగా సిద్ధం కావాలని కోరారు. దీనిని విజయవంతంగా చేశాక మరిన్ని డోసులు తెప్పించుకోవడంపై దృష్టిపెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

వీడియో కాన్ఫరెన్స్‌కు హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ -19 మేనేజిమెంట్ అండ్ వాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర,  హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.