కాలేజీల్లో కూడా నాడు – నేడు కార్యక్రమాలు చేయాలన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. గురువారం ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య, సంబంధిత శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌చంద్ర‌తో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... కాలేజీల్లో కూడా నాడు – నేడు కార్యక్రమాలకు సంబంధించి కార్యాచరణ పూర్తి చేసి, అత్యుత్తమ ప్రమాణాలను తీసుకురావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ, కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

తెలుగు, సంస్కృతం అకాడమీల ప్రారంభానికి సీఎం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. కురుపాంలో ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ పనులు మొదలుపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో యూనివర్శిటీలు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు.

పాడేరులో ట్రైబల్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకారం తెలిపారు. ప్రతి ఏటా కచ్చితమైన నిధుల కేటాయింపుతో.. వచ్చే మూడు నాలుగేళ్లలో వాటి నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. అలాగే వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దాదాపు 1110 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. అక్టోబరు 15న కాలేజీలు తెరవాలని జగన్ నిర్ణయించారు. సెప్టెంబర్‌లో సెట్‌ల నిర్వహణ పూర్తి చేయాలని, కాలేజీలు తెరిచిన తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన ఇచ్చేందుకు సన్నద్ధం కావాలని ఆర్ధిక శాఖ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.