గ్రామాల్లోకి డాక్టర్లు వచ్చి వైద్యం చేసేలా చూడాలని ఆదేశించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ఆస్పత్రుల్లో నాడు-నేడు’పై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రతి మండలంలో కనీసం రెండు పీహెచ్‌సీలు ఉండేలా చూడాలన్నారు. అంచనాగా ప్రతి పీహెచ్‌సీల్లో కనీసం ఇద్దరు చొప్పున నలుగురు డాక్టర్లు ఉన్నారనుకుంటే.... ప్రతి డాక్టర్‌కు కొన్ని గ్రామాలను కేటాయించాలి.

ప్రతి నెలకు రెండు సార్లు డాక్టర్‌ తనకు నిర్దేశించిన అదే గ్రామాలకు వెళ్లాలి. దీంతో గ్రామాల్లో ప్రజలకు, వారి ఆరోగ్య పరిస్థితుల మీద డాక్టర్‌కు అవగాహన ఏర్పడుతుంది. ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నారన్నదానిపైన కూడా వైద్యుడికి అవగాహన వస్తుంది.

వైద్యుడు ఆయా గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఆరోగ్య మిత్ర, ఆశావర్కర్‌లు డాక్టర్‌తో ఉంటారు. 104 వాహనాల ద్వారా వారికి చికిత్స అందించడం సులభం అవుతుంది. హోం విజిట్స్‌ కూడా చేయాలి. అవసరం అనుకుంటే 104లనుకూడా పెంచుకోవాలి.

డాక్టర్‌  సేవలు అందించడానికి విలేజ్‌ క్లినిక్‌ కూడా వేదికగా ఉంటుంది. కొంతకాలానికి పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్‌కు పూర్తి అవగాహన ఏర్పడుతుంది.దీంతో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ వస్తుంది.

వైద్యం చేయడం సులభమవుతుంది. దీని కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఉదారంగానే ఉండాలి. ప్రజలకు చికిత్స అందించడానికి కూడా, అవసరమైన మందులు సమకూర్చడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి.

పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరోగ్యకార్డుల్లో నమోదుకూ అవకాశం ఏర్పడుతుంది. మెరుగైన వైద్యం కోసం సరైన ఆస్పత్రికి వారు రిఫరెల్‌ చేయగలుగుతారు. ఈ వ్యవస్థ కోసం తగిన చర్యలు తీసుకోవాలి.

దీనివల్ల ఆరోగ్య సేవలు సక్రమంగా అందుతాయి. అవసరమనుకున్న చోట మండలానికి రెండో పీహెచ్‌సీని ఏర్పాటు చేయాలి. దీనిపై పూర్తిస్థాయిలో కార్యాచరణ సిద్ధంచేసుకోవాలి. ఈ వ్యవస్థను ఎప్పటినుంచి అందుబాటులోకి తీసుకు వస్తారన్న దానిపై తేదీని కూడా ఖరారు చేయాలని’’ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.