ఇక నుండి ఏటా రెండు దఫాలు లా నేస్తం: నిధులు విడుదల చేసిన వైఎస్ జగన్
లా నేస్తం పథకం కింద లబ్దిదారులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ నిధులను విడుదల చేశారు.
గుంటూరు:ఇక నుండి లా నేస్తం పథకం కింద లబ్దిదారులకు రెండు దఫాలు ఆర్దిక సహయం అందిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.బుధవారం నాడు లా నేస్తం పథకం కింద ఏపీ సీఎం వైఎస్ జగన్ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా లబ్దిదారులతో వర్చువల్ గా సీఎం ప్రసంగించారు. న్యాయవాదులకు ప్రభుత్వం తోడుగా ఉందని తెలిపేందుకు లా నేస్తం పథకం అమలు చేస్తున్నామన్నారు సీఎం.
న్యాయవాదుల కోసం రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసినట్టుగా సీఎం వైఎస్ జగన్ చెప్పారు. గత మూడేళ్లుగా లా నేస్తం నిధులు విడుదల చేస్తున్నామన్నారు.మూడున్నర ఏళ్లలో 4248 మంది లాయర్లకు లా నేస్తం కింద ఆర్ధిక సహయం అందించిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. ఈ పథకం కింద ఇప్పటికే రూ. 35.40 కోట్లు ఆర్ధిక సహయం అందించిన విషయాన్ని సీఎం చెప్పారు.
లా డిగ్రీ తీసుకున్న తొలి మూడేళ్లపాటు న్యాయవాదులు స్థిరపడేందుకు ప్రభుత్వం అందించే లా నేస్తం నిధులు సహకపడుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 2011 మంది న్యాయవాదులు ఈ పథకం కింద ధరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు. కొత్తగా లా నేస్తం కింద ధరఖాస్తు చేసుకున్న న్యాయవాదుల బ్యాంకు ఖాతాల్లో రూ. 1.55 కోట్లు జమ చేస్తున్నట్టుగా సీఎం తెలిపారు.