అమరావతి: 2019-20 నుండి రైతులందరికీ పంటల భీమాను అమలు చేయనున్నట్టుగా  ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు.ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమీయం డబ్బులను కూడ ప్రభుత్వమే చెల్లించనుందని ఆయన స్పష్టం చేశారు.

శుక్రవారం నాడు అమరావతిలో 2018-19 రబీకి సంబంధించి రూ. 596. 36 కోట్ల నిధులను ఆయన విడుదల చేశారు.  5 లక్షల 94 వేల 500 మంది రైతులకు దీని ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 

పాత బకాయిల కింద బ్యాంకర్లు ఈ నిదులను జమ చేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ విషయమై కలెక్టర్లు, వ్యవసాయశాఖాధికారులు బ్యాంకర్లతో మాట్లాడాల్సిందిగా ఆయన కోరారు.

పంటల భీమా కింద రైతులు ఇన్సూరెన్స్ డబ్బులను సాధారణంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రతి రైతు కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే సరిపోతోందని సీఎం జగన్ చెప్పారు. 

2019-20 నుండి రైతులందరికీ పంటల భీమాను అమలు చేయనున్నట్టుగా ఆయన తెలిపారు. భీమా పరిహారం పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం రైతులకు హామీ ఇచ్చారు. రైతులు కట్టాల్సిన ప్రీమియం వాటాను కూడ తామే చెల్లిస్తామని సీఎం ప్రకటించారు.

రైతాంగం సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను అమల్లోకి తీసుకొచ్చినట్టుగా ఆయన తెలిపారు. రైతులు పంటలు వేసుకొనే సమయం నుండి పంటను విక్రయించుకొనేవరకు రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయశాఖాధికారులు, ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని  సీఎం స్పష్టం చేశారు.