అమరావతి : మనం నాటే ప్రతీ మెుక్క భూమాతకు మేలుచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో నిర్వహించిన 70వ వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ విద్యార్థులతో కలిసి మెుక్కను నాటారు. 

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోందని జగన్ స్పష్టం చేశారు.  అడవుల పెంపకం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరూ మెుక్కను నాటాలని పిలుపునిచ్చారు. 

పలు పరిశ్రమలు, కంపెనీలు ప్రైవేట్ సంస్థలు కూడా మెుక్కలను పెంచేందుకు ముందుకు రావాలని కోరారు. వనమహోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మెుక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు కోట్ల ముక్కలు నాటినట్లు సమాచారం ఉందన్నారు. 

మెుక్కలు పెంచేందుకు ముందుకు వస్తే వాలంటీర్లు ద్వారా మెుక్కలు పంపిణీ చేస్తామని జగన్ తెలిపారు. రాష్ట్రంలో పులులు, సింహాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందన్నారు. ఫలితంగా అడవులను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. 

త్వరలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ప్రక్షాళన చేయనున్నట్లు జగన్ తెలిపారు. ఫార్మా రంగంలో లక్ష టన్నుల వ్యర్థాలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. నీరు, నేల గాలి కలుషితం కాకుండా చూడాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. 

ఆర్టీసీలో వెయ్యి ఎలక్ట్రానిక్ బస్సులను తీసుకువస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కృషి చేసిన వారిని ప్రభుత్వం ప్రత్యేకంగా అభినందిస్తుందని సీఎం జగన్ తెలిపారు.