కరోనా నివారణా చర్యలు, లాక్‌డౌన్ అమలుపై బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ విస్తరణ, పరీక్షలు, పాజిటివ్‌గా నమోదైన కేసుల వివరాలను సీఎంకు అందించారు. 

మరో నాలుగైదు రోజుల్లో కోవిడ్ 19 పరీక్షల రోజువారీ సామర్థ్యం 2 వేల నుంచి 4 వేలకు పెంచుతామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు 2,100కు పైగా పరీక్షలు చేస్తున్నామన్న అధికారులు.... ట్రూనాట్ పరికరాలను వినియోగించుకుని పరీక్షల సామర్ధ్యాన్ని పెంచుతామని తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కుటుంబ సర్వే గుర్తించిన సుమారు 32 వేల మందికి కూడా పరీక్షలు చేయాలని సూచించారు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ర్యాండమ్‌గా పరీక్షలు చేయాలన్నారు.

రంటైన్ సెంటర్లలో సదుపాయాలపై ఆరా తీసిన ముఖ్యమంత్రి... ప్రతిరోజూ ప్రతి మనిషికి భోజనం, బెడ్‌కోసం, దుప్పటి కోసం రూ.500.. ప్రతిరోజూ ప్రతిమనిషికి రూ. 50లు పారిశుద్ధ్యం కోసం, ఇతరత్రా ఖర్చులకోసం రోజుకు రూ.50లు, ప్రయాణ ఖర్చుల కింద క్వారంటైన్‌ సెంటర్‌కు రూ.300లు, తిరుగు ప్రయాణంకోసం కూడా మరో రూ.300లు ఖర్చు చేస్తున్నట్టుగా వెల్లడించిన అధికారులు తెలిపారు.

క్వారంటైన్‌ సెంటర్లలో మెడికల్‌ ప్రోటోకాల్‌ పూర్తిచేసుకుని తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు బీదలకు కనీసం రూ.2వేలు ఆర్థిక సహాయం చేయాలని జగన్ ఆదేశించారు. వాళ్లు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పాటించాల్సిన జాగ్రత్తలను సూచించి, ప్రతి వారం కూడా వాళ్లు పరీక్షలు చేయించుకునేలా చూడాలన్నారు.

ఫ్రంట్‌ లైన్లో ఉన్నవారికి, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నవారి ఆరోగ్య పరిరక్షణలో జాగ్రత్త వహించాలని జగన్ కోరారు. అరటి, పుచ్చ ఉత్పత్తులకు మార్కెటింగ్‌పై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులను ఆదుకోవడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకోవాలని తెలిపారు. వంట నూనెలు సహా ఇతర ధరలు పెరగకుండా చూడాలని జగన్ సూచించారు.