అమరావతి: ప్రజా సంకల్పయాత్ర అనేది తనకు ఒక స్ఫూర్తిదాయకమైన అంశమని చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశాను అంటే అది సామాజ్య విషయం కాదని ప్రజల అండదండలతో అది నెరవేర్చగలిగానని స్పష్టం చేశారు. 

వైయస్ జగన్ పాదయాత్రపై ప్రముఖ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి రచించిన జయహో పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ది ప్రింట్ ఎడిటర్ చీఫ్ పద్మభూషన్ శేఖర్ గుప్తా హాజరయ్యారు. 

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు తాను చేసిన పాదయాత్రను జీవితంలో మరచిపోలేనన్నారు జగన్. 14నెలల పాటు సాగిన పాదయాత్రలో ప్రతీ పేదవాడిని కలిశానని, దాని ఫలితంగానే ఎన్నడూ లేనివిధంగా 50శాతం ఓట్లు వైసీపీకి వచ్చాయని జగన్ స్పష్టం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పుకొచ్చారు. ప్రతీక్షణం ప్రజల కోసమే పనిచేస్తున్నట్లు తెలిపారు. తన పాదయాత్రపై పుస్తకాన్ని రచించినందుకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. 

 వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా చరిత్ర సృష్టించారని ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా అభిప్రాయపడ్డారు. దివంగత సీఎం వైయస్ఆర్ ఆశయాలను, వారసత్వాలను జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని స్పష్టం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. వైయస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చానని ఆ సందర్భంగా రాష్ట్రంలో కరువుపై ప్రస్తావించినట్లు చెప్పుకొచ్చారు. 

వర్షాలు కురుస్తాయని కరువు పోతుందని వైయస్ భరోసా ఇచ్చారని అదే సంవత్సరం భారీగా వర్షాలు కురిశాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. దేశంలో జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయని తెలిపారు. 

వైయస్ జగన్ నాయకత్వం ప్రజలకు ఎంతో అవసరమని కొనియాడారు. నాలుగున్నర దశాబ్ధాల పాత్రికేయ అనుభవంలో జగన్ పాదయాత్రపై పుస్తకం రాయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి తెలిపారు.