Andhra Pradesh News :గ్రాసిమ్ ఫ్యాక్టరీలో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు, కేసుల ఎత్తివేస్తానన్న జగన్
తూర్పు గోదావరి జిల్లాలోని బలభద్రపురంలో గ్రాసిమ్ ఫ్యాక్టరీని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా రూ. 2700 కోట్లు పెట్టుబడులు వస్తాయన్నారు. అంతేకాదు 2500 మందికి ఉపాధి కూడా దొరుకుతుందన్నారు.
కాకినాడ: క్వాప్టివ్ థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయవద్దని తాము చేసిన వినతిని Grasim ఫ్యాక్టరీ ఒప్పుకొందని ఏపీ సీఎం జగన్ చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలోని బలభద్రపురంలో గ్రాసిమ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం YS Jagan గురువారం నాడు పాల్గొన్నారు.
టెక్నాలజీ సహాయంతో జీరో లిక్విడ్ వేస్ట్ డిశ్చార్జ్ చేస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు కాలుష్యం కూడా ఉండదని సీఎం చెప్పారు. గతంలో ప్రజల్లో ఉన్న అనుమానాలు, భయాలను తొలగించే విధంగా ఫ్యాక్టరీ యాజమాన్యం ముందుకు వచ్చిందన్నారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో భూగర్భ జలాలు, వాయు కాలుష్యం కాకుండా జాగ్రత్తలు తీసుకొన్నారని సీఎం జగన్ చెప్పారు. గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా రూ. 2700 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయన్నారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో సుమారు 2500మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. స్థానికులకే ఉపాధి ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చట్టం తెచ్చిన విషయాన్ని CM ఈ సందర్భంగా గుర్తు చేశారు. 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం అంగీకరించిందన్నారు. ప్రత్యక్షంగా 1300 మందికి, పరోక్షంగా 1150 మందిక ఉపాధి దొరికే అవకాశం ఉందని సీఎం చెప్పారు. .గత ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండానే ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై సంతకాలు చేసిందని జగన్ విమర్శించారు.
గతంలో ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దని స్థానికులు ఆందోళన చేశారన్నారు. 131 మందిపై నమోదైన కేసులను ఎత్తివేశామని సీఎం జగన్ ప్రకటించారు.అనపర్తి, బిక్కవోలు మండలాల్లో మూడు మాసాల్లోనే ఇళ్ల పట్టాలనుఅందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.