ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల కంటి సమస్యలు దూరం చేసేందుకు వీలుగా ఉద్దేశించిన వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని జగన్ ప్రారంభించారు.  

అనంతపురం నగరంలోని జూనియర్ కాలేజీ గ్రాండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచ కంటి దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు, వైద్య సేవలు, కంటికి సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయనున్నారు.

ఈ పథకం మొత్తం మూడేళ్ల పాటు అమలవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం ఐదు దశల్లో అమలయ్యే ఈ పథకాన్ని జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారు. దీని కింద దాదాపు 5 కోట్ల 40 లక్షల మందికి నేత్ర పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ నెల 16 వరకు జరిగే మొదటి విడతలో సుమారు 70 లక్షల మంది స్కూల్ పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు.  ఈ పథకం కింద స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ శస్త్ర చికిత్స, ఇతరత్రా వైద్య సేవలను ప్రభుత్వం అందిస్తుంది.

అంతకుముందు గన్నవరం నుంచి అనంతపురం చేరుకున్న వైఎస్ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు.