రాష్ట్రంలో రోడ్ల నాణ్యత, నిర్మాణానికి సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు . రోడ్ల నాణ్యతపై ఇంజనీర్లు దృష్టి పెట్టాలని ఆదేశించారు.
రాష్ట్రంలో రోడ్ల నాణ్యత, నిర్మాణానికి సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం తాడేపల్లి నివాసంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఉపాదీ హామీ శాఖలపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్ల నాణ్యతపై ఇంజనీర్లు దృష్టి పెట్టాలని ఆదేశించారు. వేసిన మరుసటి సంవత్సరమే మళ్లీ రీపేర్ చేయాల్సిన పరిస్థితి రాకూడదని సూచించారు. ఉపాధి హామీలో భాగంగా ఏడాదికి 1500 లక్షల పనిదినాలను కల్పించాలన్నారు. ఇప్పటి వరకు 215.17 లక్షల పనిదినాల కల్పన జరిగిందని.. దీని కింద రూ.5280 కోట్లను ఖర్చు చేయాలని లక్ష్యంగా వుండాలన్నారు.
చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాల ద్వారా మహిళల స్వయం సాధికారతకు మరిన్ని మార్గాలను కల్పించాలని జగన్ దేశించారు. గ్రామ స్థాయిలో సుస్ధిర ఆర్ధిక ప్రగతి దిశగా వేగంగా అడుగులు పడతాయన్న ఆయన.. మహిళలకు మరింత అవగాహణ కల్పించాలని సూచించారు. మహిళలు తయారు చేస్తున్న వస్తువులు, ఉత్పాదనలకు సంబంధించి మంచి మార్కెట్ వ్యవస్థ వుండాలని జగన్ సూచించారు. ఇందుకోసం కంపెనీలతో అనుసంధానం కావాలని అధికారులను ఆదేశించారు.
Also Read: ప్రతి ఒక్కరూ సత్యనాదెళ్ల కావాలి: జగనన్న వసతి దీవెన నిధులు విడుదల చేసిన జగన్
జిల్లాకు రెండు సూపర్ మార్కెట్‌లు ఏర్పాటు చేయాలని.. అలాగే 27 చేయూత మహిళా మార్టులు ఏర్పాటు చేయాలని జగన్ సూచించారు. అలాగే మహిళలు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు డోర్ డెలివరీ, ఆన్‌లైన్ బుకింగ్, వాట్సాప్ బుకింగ్ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. అలాగే ట్రెండ్స్, అజియో వంటి కంపెనీలతోనూ ఒప్పందం చేసుకోబోతున్నామని చెప్పారు. చిత్తూరు జిల్లా కురబల కోటలో త్వరలోనే చింతపండు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని.. దీని వల్ల దాదాపు 3 వేల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని జగన్మోహన్ రెడ్డి అన్నారు.
