జీవో నెం 1ను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. తక్కువ మంది వచ్చినా ఎక్కువగా చూపే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. 

విపక్ష నేతల రోడ్ షోల వల్ల ఇటీవలి కాలంలో ప్రాణనష్టం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1 గురించి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. గురువారం హోంశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. జీవో నెం 1ను సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. రోడ్లపై సభలతో ప్రాణనష్టం జరిగే పరిస్ధితులు రాకూడదన్నారు. తమ రోడ్ షోలకు ప్రజలు ఎక్కువగా వచ్చారని చూపేందుకు రోడ్లు కిక్కిరిసేలా చేస్తున్నారని.. తక్కువ మంది వచ్చినా ఎక్కువగా చూపే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇటీవల చోటు చేసుకున్న ఆయా ఘటనల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని సీఎం విచారం వ్యక్తం చేశారు.

ఇటీవల సచివాలయాల్లో వున్న మహిళా పోలీసులకు ఖచ్చితమైన ప్రోటోకాల్ వుండాలన్నారు జగన్. వారి బాధ్యతలు, విధుల విషయంలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ఆలోచించాలన్నారు. అలాగే దిశ యాప్‌పై మరోసారి డ్రైవ్ నిర్వహించాలని జగన్ ఆదేశించారు. ప్రతి ఇంట్లో యాప్ డౌన్‌లోడ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ఒక దిశ పోలీస్ స్టేషన్ వుండాలన్నారు. డ్రగ్స్ రవాణా, పంపిణీ, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని జగన్ ఆదేశించారు. డ్రగ్స్ పెడ్లర్లకు కఠిన శిక్షలు విధించాలని జగన్ కోరారు. ఈ సమీక్షా సమావేశానికి హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి తదితర అధికారులు హాజరయ్యారు. 

Also Read: సోషల్ మీడియా వేధింపులపై ప్రత్యేక విభాగం.. మరోసారి దిశా యాప్‌పై డ్రైవ్ : జగన్ వ్యాఖ్యలు

అంతకుముందు రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపైనా జగన్ గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంట నష్టం వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికి పరిహారం అందలేదన్న మాట రాకూడదన్నారు. రైతులకు జరిగిన పంట నష్టంతో పాటు ఇతర వివరాలను గ్రామ సచివాలయాల నుంచి సేకరించాలని జగన్ ఆదేశించారు. 

తడిసిన , రంగుమారిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని.. ఎన్యుమరేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత నష్టోపోయిన రైతుల వివరాలను గ్రామ సచివాలయాల్లో వుంచి తనిఖీ చేయాలని జగన్ సూచించారు. దీని వల్ల ఎవరికైనా సాయం అందకపోతే వారి వివరాలను నమోదు చేసుకోవడానికి వీలు కలుగుతుందన్నారు. రబీ సీజన్‌కు కూడా ధాన్యం కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని.. రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ఓ టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయాలని జగన్ సూచించారు. రైతుల సమస్యలు, ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.