Asianet News TeluguAsianet News Telugu

కుళ్లు, కుతంత్రాలు తెలియవు: మేకపాటి గౌతం రెడ్డి మృతిపై ఏపీ అసెంబ్లీలో సంతాపం తీర్మానం

ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గౌతం రెడ్డి మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ గౌతం రెడ్డి మృతిపై అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.

AP CM YS Jagan introduces Mekapati Goutham Reddy Condolence resolution in AP Assembly
Author
Nellore, First Published Mar 8, 2022, 9:39 AM IST


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి Mekapati  Gautham Reddy మృతి పట్ల AP Assembly సంతాపం తెలిపింది. ఏపీ సీఎం YS Jagan  మంగళవారం నాడు అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.మేకపాటి గౌతం రెడ్డి మృతి పట్ల సీఎం జగన్ సంతాపం తెలిపారు. గౌతం రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.  

ఈ సంతాప తీర్మానంపై ఏపీ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి Anil Kumar Yadav ప్రసంగించారు. అసెంబ్లీ జరిగే సమయంలో గౌతం రెడ్డి తన పక్కనే కూర్చొనేవారని ఆయన గుర్తు చేసుకొన్నారు. Nellore  జిల్లా రాజకీయాల్లో వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి గౌతం రెడ్డి అని ఆయన చెప్పారు. కోపం అంటే ఏమిటో కూడా గౌతం రెడ్డికి తెలియదని ఆయన చెప్పారు. 

గౌతం రెడ్డి చాలా ఫిట్‌గా ఉండేవాడన్నారు. కానీ అలాంటి వ్యక్తి ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడంటే నమ్మబుద్ది కావడం లేదన్నారు. నెల్లూరు జిల్లా నుండి సీఎం జగన్ తన కేబినెట్ లో తనను గౌతం రెడ్డిని కేబినెట్ లోకి తీసుకొన్నారన్నారు. అయితే తమ మధ్య ఎలాంటి విబేధాలు ఏనాడూ లేవన్నారు.  తనను ఎప్పుడూ కూడా గౌతం రెడ్డి ప్రోత్సహించారని మంత్రి అనిల్ కుమార్ గుర్తు చేశారు. గౌతం రెడ్డి మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటన్నారు. గౌతం రెడ్డి మరణించిన విషయాన్ని తాము ఇంకా జీర్ణించుకోలేక పోతున్నామన్నారు. కానీ కుటుంబ సభ్యులు ఎలా తట్టుకొంటారోనని చెప్పారు. రాజకీయాలు అంటేనే  ఇగోలు, కుళ్లు, కుతంత్రాలు, వెన్నుపోట్లు వంటివి ఉంటాయన్నారు. కానీ ఇవేవీ కూడా గౌతం రెడ్డికి తెలియవన్నారు. జిల్లా నుండి ఇద్దరం మంత్రులుగా ఉన్నప్పటికీ తమ మధ్య ఏనాడూ  కూడా వివాదాలు కూడా రాలేదన్నారు. రానున్న రోజుల్లో ఈ తరహ వ్యక్తిని తాను చూడబోనని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. 

రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి Peddireddy Ramachandra Reddy ఈ సంతాప తీర్మానంపై మాట్లాడారు.Chittoor జిల్లా ఇంచార్జీ మంత్రిగా తమ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో ఎప్పుడూ కూడా కలుపుగోలుగా ఉండేవాడన్నారు.   ఇంచార్జీ మంత్రిగా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు ఏ విషయం అడిగినా కూడా ఆయన నవ్వుతూ సమాధానం ఇచ్చేవారన్నారు. గౌతం రెడ్డి మరణంతో ఆయన కుటుంబం ఇంకా కోలుకోలేదన్నారు. గౌతం రెడ్డి లాంటి వాళ్లు  రాజకీయాల్లో అరుదుగా ఉంటారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. గౌతం రెడ్డి మరణం తమ పార్టీకి కూడా తీవ్ర నష్టమన్నారు.

నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడారు. గుండెపోటుతో మంత్రి గౌతం రెడ్డిని ఆసుపత్రిలో చేర్పించారని తెలియగానే ఆరోగ్యంగా ఆయన తిరిగి ఇంటికి వస్తారని తామంతా భావించామన్నారు. కానీ  మంత్రి గౌతం రెడ్డి మరణిస్తాడని తాము కలలో కూడా ఊహించలేదన్నారు.

సంగం బ్యారేజీకి మేకపాటి గౌతం రెడ్డి పేరు

మేకపాటి గౌతమ్‌రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్ది తెలిపారు. గౌతమ్‌రెడ్డి మృతి తనకు,పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటు అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రెండోరోజు గౌతమ్‌రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.ఈ సంతాప తీర్మానంపై పలువురు  సభ్యులు ప్రసంగించిన అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. 

వెలిగొండ ప్రాజెక్ట్‌ ద్వారా ఉదయగిరికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. సంగం బ్యారేజీ పనులను 6 వారాల్లో పూర్తి చేస్తామని అన్నారు. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెడతామని అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. గౌతమ్‌రెడ్డి తనకు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితుడని గుర్తు చేసుకున్నారు.

మంచి స్నేహితుడ్ని కోల్పోవడం బాధాకరమని అన్నారు. గౌతమ్‌రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. చాలా సందర్భాల్లో గౌతమ్‌రెడ్డి తనకు అండగా నిలబడ్డారని సీఎం జగన్‌ గుర్తుచేశారు. ఆయన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారని తెలిపారు. రాష్ట్రంలోకి కొత్త కంపెనీలు రావడంలో గౌతమ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు.పారిశ్రామిక మంత్రిగా గౌతమ్‌రెడ్డి చాలా కృషి​ చేశారని తెలిపారు. గౌతమ్‌రెడ్డి లేకపోయినా ఆయన కన్న కలలు నెరవేరుస్తామని సీఎం జగన్‌ అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios