తండ్రిలా రాష్ట్రాభివృద్దికి సహకరించారు: గవర్నర్ బిశ్వభూషన్ వీడ్కోలులో జగన్
రాజ్యాంగ వ్యవస్థల సమన్వయాన్ని ఆచరణలో రాష్ట్ర గవర్నర్ చూపారని ఏపీ సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ కు ఇవాళ ప్రభుత్వం వీడ్కోలు సమావేశం నిర్వహించింది.
విజయవాడ:ఒక తండ్రిలా , పెద్దలా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి గవర్నర్ బిశ్వభూషన్ అండగా నిలిచారని ఏపీ సీఎం జగన్ చెప్పారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి గవర్నర్ గా బదిలీ అయ్యారు. దీంతో ఇవాళ ప్రభుత్వం తరపున విజయవాడలో వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగించారు. రాష్ట్రంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వానికి గవర్నర్ సంపూర్ణంగా సహకరించారని సీఎం జగన్ చెప్పారు.
గవర్నర్ వ్యవస్థకు బిశ్వభూషణ్ హరిచందన్ నిండుతనం తీసుకువచ్చారని సీఎం చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థలో సమన్వయాన్ని ఆచరణలో చూపారన్నారు.రాష్ట్ర ప్రభుత్వాలకు , గవర్నర్ల మధ్య సంబంధాలపై ఇటీవల కాలంలో అనేక వార్తలను చూస్తున్న విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. కానీ, రాష్ట్రంలో అందుకు భిన్నంగా పరిస్థితి ఉండడానికి బిశ్వభూషణ్ కారణంగా సీఎం అభిప్రాయపడ్డారు.
ఐదు దఫాలు ఒడిశా అసెంబ్లీకి హరిచందన్ ఎన్నికయ్యారన్నారు. ఒడిశా బార్ అసోయేషన్ లో బిశ్వభూషణ్ కీలకంగా వ్యవహరించారని సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. బిశ్వభూషన్ హరిచందన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేయాలని మససారా కోరుకుంటున్నానని సీఎం ఆకాంక్షను వ్యక్తం చేశారు. గవర్నర్ కు తన తరుపున రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. . గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విద్యావేత్త, న్యాయ నిపుణులని సీఎం చెప్పారు.అనంతరం సీఎం జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను సన్మానించారు.