అమెరికా నుంచి 21 మంది భారతీయ విద్యార్ధులను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపడం కలకలం రేపుతోంది. వారిలో పలువురు తెలుగు విద్యార్ధులు కూడా వున్నారు. భారతదేశానికి తిరిగి వచ్చిన విద్యార్ధుల వివరాలను తెలుసుకుని.. వారికి కావాల్సిన సాయం చేయాలని సీఎంవో అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
అమెరికా నుంచి 21 మంది భారతీయ విద్యార్ధులను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపడం కలకలం రేపుతోంది. యూఎస్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొంది, వీసాలను సాధించి, ఎన్నో ఆశలతో అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన మన విద్యార్ధులు ఈ పరిణామాలు షాకిచ్చాయి. మరోవైపు అమెరికా నుంచి తిప్పి పంపిన వారిలో పలువురు తెలుగు విద్యార్ధులు కూడా వున్నారు. సరైన డాక్యుమెంట్లు లేవంటూ, కనీసం వివరణ కూడా ఇవ్వకుండానే వారిని వెనక్కి పంపడంతో విద్యార్ధుల భవిష్యత్తుపై వారి తల్లిదండ్రులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో విద్యార్ధులు తిరిగి రావడం, తదితర అంశాల గురించి ఏపీ సీఎ వైఎస్ జగన్ ఆరా తీశారు. భారతదేశానికి తిరిగి వచ్చిన విద్యార్ధుల వివరాలను తెలుసుకుని.. వారికి కావాల్సిన సాయం చేయాలని సీఎంవో అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైతే విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరపాలని జగన్ సూచించారు.
ALso Read: అమెరికా వెళ్లిన భారత విద్యార్థులకు భారీ షాక్.. 21 మందిని వెనక్కి పంపిన అధికారులు..
కాగా.. అమెరికాలోని అట్లాంట, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగోలలోని యూనివర్సిటీల్లో చదివేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు ఈ చేదు అనుభవం ఎదురైంది. అయితే సరైన పత్రాలు లేకపోవడంతోనే వారిని వెనక్కి పంపినట్టుగా తెలుస్తోంది. మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్స్ చూసిన తర్వాత వారిని తిప్పి పంపినట్టుగా చెబుతున్నారు. ఇక, భారత్‌కు తిప్పి పంపిన 21 మంది విద్యార్థులు ఐదేళ్లపాటు పాటు అమెరికాలోకి రాకుండా వారిపై ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తోంది.
ఈ పరిణామాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా తమను ఎందుకు తిప్పిపంపతున్నారో అంటూ విద్యార్ధుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత విదేశాంగ శాఖ అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఈ పరిణామాలతో భారత్ నుంచి అమెరికాలో ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థుల్లో సైతం ఆందోళన నెలకొంది.
