ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగస్టు మొదటి వారంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 6,7 తేదీల్లో సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీ తో సమావేశం కానున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోదీ దృష్టికి రాష్ట్ర సమస్యలు, పెండింగ్ లో ఉన్న అంశాలను వివరించనున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి ఉదారంగా ఆర్థిక సాయం చేయాలని కోరనున్నారు.

రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు ప్రాజెక్టుల విషయాలు, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీతోపాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హోం శాఖ మంత్రి అమిత్ షాలను కూడా జగన్ కలవనున్నారు. వారి దృష్టికి కూడా రాష్ట్ర సమస్యలను తీసుకువెళ్లనున్నట్లు సమాచారం.

శాసనసభ ఫలితాలు వెలువడిన తర్వాత మే 26న, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక జూన్ 19న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్.. కేవలం కొన్ని గంటలు మాత్రమే అక్కడే సమయం గడిపారు. దీంతో ఈ పర్యటనలో ప్రధాని, కేంద్ర మంత్రులతో జగన్ ముఖాముఖి సమావేశం కానున్నారు.