Asianet News TeluguAsianet News Telugu

రైతులు, మహిళలను వేధించొద్దు, లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బులు చేరాలి : బ్యాంకర్ల సమావేశంలో వైయస్ జగన్

అలాగేఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేదరికాన్ని, సామాజిక వెనుకబాటును దృష్టిలో ఉంచుకునే వారికి కూడా నేరుగా చేతికి డబ్బు అందించే పథకాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. నవరత్నాల్లోని ఈ పథకాలు అన్నింటి ద్వారా తాము అందించబోయే ప్రతీ పైసా లబ్ధిదారులకే నేరుగా అందించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను సీఎం జగన్ ఆదేశించారు.  
 

ap cm ys jagan conducting slbc meeting
Author
Amaravathi, First Published Jun 18, 2019, 7:57 PM IST

అమరావతి: రాష్ట్రంలో రైతులు, మహిళలను వేధింపులకు గురి చేయోద్దని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లకు స్పష్టం చేశారు.  సచివాలయంలో 207వ  రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న సీఎం వైయస్ జగన్ 2019-20 రాష్ట్ర రుణ ప్రణాళికను ఆవిష్కరించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరిగిన సమావేశం కావడంతో కీలక అంశాలపై సమాచారాన్ని రాబట్టారు జగన్. ఈ సందర్భంగా  ప్రభుత్వ ప్రాధాన్యతలపై   బ్యాంకులకు దిశా నిర్దేశం చేసిశారు. 

ఎస్‌ఎస్‌బీసీ నివేదికలో ప్రతీఏడాది వ్యవసాయ రుణాలు, డ్వాక్రారుణాలు ఎందుకు చూపిస్తున్నారని అధికారులను నిలదీశారు. రైతు రుణామాఫీ కింద చెల్లించే డబ్బు అంతా రైతులకు నిజంగా ఇస్తున్నారా? లేక పాత రుణాలను రీషెడ్యూల్‌ చేయడంవల్ల పెరుగుతున్నాయా? అని ఆరా తీశారు. 

రైతులకు కొత్త అప్పులు ఇవ్వకుండా పాత అప్పులనే వడ్డీలతో కలిపి చూపడంవల్ల ఈ అంకెలు పెరుగుతున్నాయని బ్యాంకర్లు సీఎం వద్ద ప్రస్థావించారు. ఫలితంగా రైతులు లేదా డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాలు వారు ఆర్థికంగా బలపడ్డారని కాకుండా మరింత అప్పులుపాలయ్యారని ఈ లెక్కలు చూపిస్తున్నాయని ఈ సమావేశంలో జగన్ అభిప్రాయ పడ్డారు. 

గత ప్రభుత్వం సున్నా వడ్డీకోసం చెల్లించాల్సిన తన వాటాను చెల్లించిందా? అని బ్యాంకర్లను ప్రశ్నించారు. రైతులకు సున్నావడ్డీ లభించకపోవడం వల్ల రుణమాఫీ 87,612 కోట్లు చేస్తానని చివరికి రూ.15వేల కోట్లు కూడా చేయకపోవడం వల్ల రైతులు పూర్తిగా అప్పులు పాలయ్యారని జగన్ అన్నారు. 

తన పాదయాత్రలో రైతుల అప్పుల గురించి విన్నానని చెప్పుకొచ్చారు. ఏటా రైతులు రూ.87,612 కోట్లకు రూ.7–8వేల కోట్ల వడ్డీలు కడితే చంద్రబాబు ప్రభుత్వం ఏటా సగటున రూ.3 వేల కోట్లు కూడా రుణమాఫీకి విడుదల చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 

గత ఐదేళ్లలో నాలుగేళ్లు కరువు ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో రైతులు రుణభారంతో దెబ్బతిని ఉన్నారని, ఇప్పుడు బ్యాంకర్లు రైతులను డ్వాక్రా మహిళలను వేధింపులకు గురి చేయకుండా ఆదుకోవాలని సూచించారు. 

 రైతుల్లో మానసిక స్థైర్యాన్ని పెంచేందుకు నవరత్నాలను అమలులోకి తీసుకువచ్చినట్లు జగన్ తెలిపారు. అందులో భాగంగా మే నెలలో వైయస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 ఇవ్వబోతున్నట్లు జగన్ తెలిపారు. 

రాష్ట్రంలో రైతుల వద్ద సగటున 1.25 ఎకరాలు మాత్రమే భూమి ఉందని, కాబట్టి రైతులందరికీ అయ్యే పెట్టుబడి వ్యయంలో దాదాపుగా 70శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. 

అయితే రైతులకు ఇవ్వబోతున్న సొమ్మును వారు అంతకుముందు ఉన్న అప్పుల్లో జమ చేయకుండా డబ్బు అందేలా చూడాలని కోరారు. అలాగే అమ్మఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే ప్రతీ తల్లికి ఏడాదికి రూ.15వేలు ఇస్తున్నామన్నారు. 

అలాగేఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేదరికాన్ని, సామాజిక వెనుకబాటును దృష్టిలో ఉంచుకునే వారికి కూడా నేరుగా చేతికి డబ్బు అందించే పథకాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. నవరత్నాల్లోని ఈ పథకాలు అన్నింటి ద్వారా తాము అందించబోయే ప్రతీ పైసా లబ్ధిదారులకే నేరుగా అందించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను సీఎం జగన్ ఆదేశించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios