సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించిన వారికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్షా 40 వేల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయని సీఎం తెలిపారు.

ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం పెట్టడం తద్వారా పది నుంచి 12 ఉద్యోగాలు, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉద్యోగం ఇచ్చామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

నాలుగు నెలలు తిరక్కముందే నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగామని ఇది భారతదేశ చరిత్రలో ఒక రికార్డని ఆయన అభివర్ణించారు. అర్హత సాధించిన వారంతా వీటిని ఒక ఉద్యోగంలా కాకుండా ఒక ఉద్యమంలా తీసుకోవాలని జగన్ సూచించారు.

సొంత మండలంలోనే ప్రభుత్వోద్యోగం చేసే భాగ్యం చాలా తక్కువ మందికి లభిస్తుందని మీ ప్రాంత రుణం తీర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ, వార్డు వాలంటీర్లతో గ్రామ సచివాలయ ఉద్యోగులు అనుసంధానం కావాలని ఇద్దరు కలిసి ప్రతి పేదవాడి ముఖంలోనూ చిరునవ్వు తీసుకురావాలన్నారు.

ఈ ఉద్యోగాలు అధికారం చెలాయించడం కోసం కాదని ప్రజలకు సేవ చేసేందుకని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 

పారదర్శకతతో వివక్షలేని, అవినీతిలేని పాలన కోసం గ్రామాల్లో అందరూ ఎదురుచూస్తున్నారని దానిని మీ భుజస్కందాలపై పెడుతున్నానని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అమెరికాకు వెళ్లినాసరే గ్రామాలపై ప్రేమ తగ్గదన్నారు.

జన్మభూమి కమీటీలు గ్రామాలను దోచేశాయని.. ప్రస్తుతం గ్రామాల్లో పాలన వెంటిలేటర్‌పై ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి ఏం కావాలన్నా 72 గంటల్లో అందేలా చూడాలని .. గ్రామ సచివాలయం ద్వారా 500 సేవలు అందించాలని జగన్ పిలుపునిచ్చారు.

రైతులకు నాణ్యమైన ఎరువులు అందిస్తామని.. గ్రామ సచివాలయాల పక్కనే ఎరువుల షాపులు ఏర్పాటు చేస్తామని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

పాలనలో వేగం పెరిగేందుకు వీలుగా గ్రామ వాలంటీర్లకు స్మార్ట్‌ఫోన్‌లు అందజేస్తామని జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో సచివాలయాలు పనిచేస్తాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. అర్హులందరికీ సంక్షే పథకాలు అందాలని ఇందులో రాజకీయాలు చూడొద్దని సీఎం కోరారు.