తిరుపతి రుయా ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. చిన్నఘటనలే మొత్తం వ్యవస్థనే అప్రతిష్ట పాలు చేస్తాయన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పోలీసు విభాగాలు సమర్థంగా పనిచేయాలని జగన్ ఆదేశించారు.
తిరుపతి రుయా ఆసుపత్రిలో (tirupati ruia hospital) ‘అంబులెన్స్’ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) స్పందించారు. మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని ఆయన అభిప్రాయపడ్దారు. ఇలాంటి చిన్నఘటనలే మొత్తం వ్యవస్థనే అప్రతిష్ట పాలు చేస్తాయని సీఎం అన్నారు. ఆస్పత్రుల్లో ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య మిత్ర కియోస్క్‌ల వద్ద ఫిర్యాదు నంబర్లు కనిపించాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా బాధితులు ఫిర్యాదు చేసేలా ఉండాలని పేర్కొన్నారు. విజయవాడ ఆస్పత్రిలో (vijayawada govt hospital) జరిగిన ఘటన లాంటిది మరోసారి జరగకుండా చూడాలని జగన్ అధికారులను ఆదేశించారు. పోలీసుల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పోలీసు విభాగాలు సమర్థంగా పనిచేయాలని సీఎం సూచించారు.
సోమవారం రాత్రి తిరుపతిలో ఈ ఘటన చోటుచేసుకోగా.. మంగళవారమే రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ (vidadala rajini) సీఎంను కలిసి ఘటన గురించి వివరించారు. అంతేకాకుండా ఈ ఘటనకు బాధ్యుడిగా గుర్తిస్తూ ఆసుపత్రి సీఎస్ఆర్ఎంవోను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయంతో పాటు అరెస్ట్ కూడా చేశారు.
అసలేం జరిగిందంటే:
Annamaiah జిల్లాలోని Chitvel కు చెందిన ఓ వ్యక్తి తన కొడుకును చికిత్స కోసం రుయా ఆసుపత్రిలో చేర్పించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు చనిపోయాడు. అయితే 10 ఏళ్ల బాలుడి డెడ్ బాడీని స్వగ్రామం తీసుకెళ్లేందుకు రుయా ఆసుపత్రిలోని అంబులెన్స్ డ్రైవర్లు రూ. 20 వేలు డిమాండ్ చేశారు. అయితే బయటి నుండి అంబులెన్స్‌ను తెప్పించుకొన్నా కూడా రుయా ఆసుపత్రిలోని డ్రైవర్లు అడ్డుకొన్నారు. బయటి నుండి వచ్చిన అంబులెన్స్ డ్రైవర్‌పై దాడికి యత్నించారు. ఈ ఘటనపై మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
