పెన్షన్ రూ.3 వేలు చేశాకే ఎన్నికలకు వెళ్తామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 45 నెలల పాలనలో మార్పు కనిపిస్తోందని.. జగన్ మార్క్ కనిపిస్తోందని సీఎం అన్నారు. కార్పోరేట్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలతో పోటీపడే పరిస్ధితి వచ్చిందని సీఎం జగన్ పేర్కొన్నారు. 

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 80 శాతం నెరవేర్చామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. విలువలు , విశ్వసనీయతే పునాదులుగా పనిచేస్తున్నామని.. నాలుగేళ్ల పాలనలో కులం, మతం, ప్రాంతం, వర్గం చూడకుండా మంచి చేశామని సీఎం అన్నారు. ఎన్నికలైపోయాక అందరూ నావాళ్లే అని నాలుగేళ్ల పాలనలో నిరూపించామని జగన్ పేర్కొన్నారు. లక్షా 90 వేల కోట్లు పిల్లలు, యువత, వృద్ధులకు నేరుగా అందించామని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

గత ప్రభుత్వాల బడ్జెట్లు ఎవరికీ అర్ధమయ్యేవి కావని.. ఇంటింటికీ వెళ్లి జరిగిన మంచి పనిని వివరించామని సీఎం తెలిపారు. మా నైతికతకు, నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చామని.. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను ఏర్పాటు చేశామని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ డివిజన్‌లను 51 నుంచి 76కు పెంచామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పట్టణాల్లో పదివేలకు పైగా సర్వేయర్లు అందుబాటులో వున్నారని.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ అని జగన్ అన్నారు. 11.23 శాతం ఆర్ధిక వృద్ధి రేటుతో రాష్ట్రం ఆర్ధిక వృద్ధి రేటుతో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

45 నెలల పాలనలో మార్పు కనిపిస్తోందని.. జగన్ మార్క్ కనిపిస్తోందని సీఎం అన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం అందించిన పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలని.. వైసీపీ ప్రభుత్వం 65 లక్షల మందికి పెన్షన్ అందిస్తోందని సీఎం జగన్ చెప్పారు. 2700 రూపాయల నుంచి మూడు వేల వరకూ పెన్షన్ పెంచుతామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పెన్షన్ 3 వేలు చేశాకే ఎన్నికలకు వెళ్తామన్నారు. ఏపీ తరహాలో పెన్షన్ అందిస్తోన్న రాష్ట్రం ఎక్కడా లేదని జగన్ పేర్కొన్నారు. 8వ తరగతి నుంచి ట్యాబ్స్ ఇస్తున్నామని.. కార్పోరేట్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలతో పోటీపడే పరిస్ధితి వచ్చిందని సీఎం అన్నారు. వచ్చే రెండేళ్లలో 6వ తరగతి నుంచి డిజిటల్ క్లాసులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. 

అమ్మఒడి కోసం 20 వేల కోట్లు ఖర్చు చేశామని.. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ , ఉచిత విద్యుత్, ధాన్యం సేకరణ చేశామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని.. ఎన్నికల హామీలను మరిచిపోవడం గత ప్రభుత్వానికి అలవాటని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మరో లక్షా 50 వేల ఎంఎస్ఎంఈలు వచ్చాయని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్యను 4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచామని ముఖ్యమంత్రి తెలిపారు. మత్స్యకారులకు 4 ,200 కోట్లు.. నేతన్నలకు 778 కోట్లు అందించామన్నారు. వీధి వ్యాపారులకు వాహనమిత్ర, జగనన్న తోడు వంటి పథకాలతో అండగా నిలిచామని జగన్ పేర్కొన్నారు. 22 లక్షల ఇళ్ల నిర్మాణంతో దేశానికే ఆదర్శంగా నిలిచామని సీఎం తెలిపారు. కోటి 17 లక్షల మంది దిశా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని.. దిశా యాప్‌తో పాటు దిశా పోలీస్ స్టేషన్‌లు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. దిశా చట్టం చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని ఆయన గుర్తుచేశారు.

వైద్య రంగంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ని తీసుకొచ్చామని.. గ్రామ స్థాయిలో 10,500 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఇండస్ట్రీస్, వ్యవసాయం రెండూ ప్రభుత్వానికి సమానమేనని వైఎస్ జగన్ అన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ ప్రభుత్వానికి ముఖ్యమేనని.. తన నడక నేల మీదేనని, తన ప్రయాణం సామన్యులు, పేద వర్గాలతోనే ముఖ్యమంత్రి తెలిపారు. తనకు ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ముఖ్యమో, అవ్వతాతలు అంతేనని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఇదే నా ఎకనామిక్స్, ఇదే నా పాలిటిక్స్.. ఇదే మా నాన్నను చూసి నేర్చుకున్న హిస్టరీ అని జగన్ పేర్కొన్నారు. తన యుద్ధం పెత్తందార్లతోనేనని సీఎం స్పష్టం చేశారు.