అమరావతి:  రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశంసలతో ముంచెత్తారు. 'మన పాలన – మీ సూచన' సదస్సులో గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో పారిశ్రామిక, పెట్టుబడులు, నైపుణ్య రంగాలపై ఏడాది పాలనపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కృషిని మెచ్చుకున్నారు.  పారిశ్రామిక నేపథ్యం ఉన్నవాడు కాబట్టి వాటి అవసరాలకు అనుగుణంగా స్పందిస్తారని.. "మంచి స్పందించే హృదయం ఉన్నోడని" పొగడ్తలతో ముంచెత్తారు. 

''మన గౌతమ్ వెరీ ఎంటర్ ప్రైజింగ్ మినిస్టరే అనే దానికన్నా మంచి ఎంటర్ ప్రైజింగ్ ఎంట్రప్రిన్యూర్ అనాలి.  ఇండస్ట్రియల్ బ్యాక్ గ్రౌండ్ ఉండటం వల్ల ఇండస్ట్రీస్ అవసరాలకు బాగా సానుకూలంగా స్పందించే హృదయం ఉన్నోడు.. యంగ్ స్టర్, మంచివాడు, యువకుడు, ఉత్సాహవంతుడు.. అన్ని రకాలుగా ప్రో యాక్టివ్ గా ఉంటాడు.. ఆల్ ది బెస్ట్ గౌతమ్” అంటూ సీఎం ప్రత్యేకంగా అభినందించారు. 

ఇందుకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమాధానంగా ముఖ్యమంత్రి అభిమానంతో అన్న మాటలకు చిరునవ్వులతో స్పందించారు. లోలోపలే మనసారా నవ్వుకుంటూ ప్రేమగా ఆస్వాదించారు. పక్కనే ఉన్న సమాచార, పౌరసంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్నీ నాని కూడా మంత్రి మేకపాటిని ఆప్యాయంగా మెచ్చుకున్నారు.