అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఏపీపీఎస్సీ భర్తీ చేసే ఉద్యోగాల నియామకాల్లో ఇంటర్యూ విధానాన్ని రద్దు చేయాలని జగన్ ఆదేశించారు. 

2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇక నుంచి కేవలం రాత పరీక్షలలో మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. 
 
గురువారం ఏపీపీఎస్సీ జాబ్‌ క్యాలెండర్‌పై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్‌ రూపొందించాలని అధికారులకు పలు సూచనలు చేశారు. 

అత్యంత పారదర్శకంగా ఏపీపీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేయాలని సూచించారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం అయ్యేలా ఆలోచన చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే అత్యవసర సర్వీసులు అందిస్తున్న విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా సీఎం సూచించారు. 

ఏపీపీఎస్సీ విడుదల చేసే ప్రతీ నోటిఫికేషన్ చాలా జాగ్రత్తగా విడుదల చేయాలని దిశానిర్దేశం చేశారు. నోటిఫికేషన్‌ విడుదలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. 

అలాగే ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో ఇప్పటి వరకు కొనసాగుతున్న విభాగాల సంఖ్యను తగ్గించాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రస్తుతం 26కిపైగా విభాగాల్లో ఉద్యోగాల భర్తీ జరుగుతుందని అయితే వాటిని రాబోయే రోజుల్లో కేవలం 6 విభాగాలకే పరిమితం చేసి నోటిఫికేషన్ భర్తీ చేయాలని ఆదేశించారు సీఎం జగన్. 

ఏపీపీఎస్సీ ఉద్యోగాల నియామకాల్లో అవినీతి జరుగుతుందంటూ గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వాటిని సరిదిద్దేందుకు జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీ ఎస్సీ ద్వారా వెలువడే ప్రతీ నోటిఫికేషన్ పారదర్శకంగా ఉండాలని జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. 

ఇప్పటికే పలురాష్ట్రాల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి అయిన తర్వాత వైయస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామ సచివాలయం వ్యవస్థను నెలకొల్పారు. 

వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగాలను సైతం ప్రభుత్వమే చేపట్టింది. అయితే అభ్యర్థులను పరీక్ష ద్వారానే ఎంపిక చేసింది. ఎలాంటి ఇంటర్యూలు నిర్వహించలేదు సీఎం జగన్. ఇంటర్వ్యూ విధానం లేకుండా ఉద్యోగాల భర్తీ సక్సెస్ కావడంతో అదే పంథాను ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ కు అప్లై చేయాలని సీఎం జగన్ భావించారు. 

ఇంటర్వ్యూ రద్దు ద్వారా పారదర్శకంగా నియామకాలు చేపట్టవచ్చుననని జగన్ భావిస్తున్నారు. అలాగే భవిష్యత్ లో నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలోనూ న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కూడా జగన్ ఆదేశించారు. 

ఏపీపీఎస్సీ పరీక్షలకు సీఎం జగన్ ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెరిట్ లో అత్యంత అద్భుతమైన ప్రతిభకనబరుస్తున్నప్పటికీ ఇంటర్వ్యూ విధానంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొని ఉద్యోగాలకు దూరమవుతున్నామని చెప్పుకొస్తున్నారు. జగన్ నిర్ణయం వల్ల కష్టపడిన ప్రతీ ఒక్కరూ జాబ్ కు అర్హుడయ్యే అవకాశం ఉందంటున్నారు.